Homeట్రెండింగ్ న్యూస్Hindenburg- Black Inc: మరో వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్ప కూల్చిన హిండేన్ బర్గ్

Hindenburg- Black Inc: మరో వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్ప కూల్చిన హిండేన్ బర్గ్

Hindenburg- Black Inc
Hindenburg- Black Inc

Hindenburg- Black Inc: హిండేన్ బర్గ్… ఇప్పుడు ఈ పేరు వింటేనే కార్పొరేట్ సామ్రాజ్యాలు వణికి పోతున్నాయి. ఎక్కడ తమ లోగుట్టు బయటపడుతుందోనని బెంబేలెత్తిపోతున్నాయి. ఇన్ సైడర్ వ్యవహారాలు, స్పెక్యులేషన్ మోసాలు వినియోగదారులకు తెలుస్తాయేమోనని భయపడుతున్నాయి. మరోవైపు హిండేన్ బర్గ్ కూడా కార్పొరేట్ మోసాలను తవ్వితీస్తోంది. ఒకప్పటి పనామా లీక్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో.. ఇప్పుడు అంతకుమించి సంచలనాన్ని హిండెన్ బర్గ్ సృష్టిస్తోంది.

బండారాన్ని బయటపెట్టింది

అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ.. తాజాగా మరో కంపెనీ బండారాన్ని బయట పెట్టింది. ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ 2009లో అమెరికాలో స్థాపించిన మొబైల్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌, పేమెంట్స్‌ సంస్థ ‘బ్లాక్‌ ఇంక్‌’ పెద్ద మోసాల పుట్ట అని ప్రకటించింది. వినూత్న టెక్నాలజీ పేరుతో ఈ కంపెనీ అమెరికా బ్యాంకింగ్‌ చట్టాలను మసిపూసి మారేడు కాయ చేస్తోందని తమ రెండేళ్ల దర్యాప్తులో ఈ విషయం తేలినట్టు తెలిపింది. ఈ కంపెనీ నుంచి పేమెంట్స్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుకునే వ్యాపారులు, ఖాతాదారుల్లో 40 నుంచి 75 శాతం మంది ‘నకిలీ’లని స్పష్టం చేసింది. కంపెనీ మాజీ ఉద్యోగులే ఈ విషయం చెప్పినట్టు ప్రకటించింది.

500 కోట్ల డాలర్ల ఆస్తులు

బ్లాక్‌ ఇంక్‌ కంపెనీ ఖాతాదారుల సంఖ్య అతిగా చెబుతూ.. కొత్త ఖాతాదారుల సేకరణ ఖర్చులు తక్కువగా చూపుతూ పబ్బం గడుపుకొస్తోందని విమర్శించింది. ఇలా తిమ్మిని బమ్మి చేయడం ద్వారా జాక్‌ డోర్సీ 500 కోట్ల డాలర్ల ఆస్తులు వెనకేసుకున్నట్టు తెలిపింది. బ్లాక్‌ ఇంక్‌ ఈక్విటీలో 100 కోట్ల డాలర్ల వాటా అమ్మకమూ పెద్ద మోసమని పేర్కొంది. సంప్రదాయ బ్యాంకింగ్‌ సేవలు అందుకోలేని మోసగాళ్లు, నేరస్థులే బ్లాక్‌ ఇంక్‌ అందించే పేమెంట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుకుంటున్నట్టు తమ దర్యాప్తులో తేలినట్టు తెలిపింది.

Hindenburg- Black Inc
Hindenburg- Black Inc

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ఈ వార్తలతో అమెరికా స్టాక్‌ మార్కెట్లో బ్లాక్‌ ఇంక్‌ కంపెనీ షేర్లు గురువారం కుప్పకూలాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 20 శాతం వరకు నష్టపోయాయి. ఇంత జరిగినా హిండెన్‌బర్గ్‌ నివేదికపై బ్లాక్‌ ఇంకా నోరు మెదపడం లేదు. దీంతో ఈ కౌంటర్‌లో సెంటిమెంట్‌ మరింత దెబ్బతింది. బ్లాక్‌ ఇంక్‌ కంపెనీలోనూ తమకు షార్ట్‌ పొజిషన్లు ఉన్నట్టు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చెప్పడం మరో విశేషం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version