Nani Dasara : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాచురల్ గా నటించే వారిలో నాని పేరు ముందు వరుసలో ఉంటుంది. పక్కింటి అబ్బాయిలా ఉంటాడు. క్యూట్ పర్ఫామెన్స్ తో అదరగొడతాడు. విషాదాన్ని అద్భుతంగా పలికిస్తాడు. యువ నటుడు అయినప్పటికీ తండ్రి పాత్రలో మెప్పిస్తాడు. తనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వదిన చేతిలో ఇబ్బంది పడే మరిదిగా, ప్రియురాలిని కోల్పోయిన ప్రేమికుడిగా.. విలన్ చేతిలో చనిపోయి ఈగగా మారిన లవర్ గా… ఇలా ఒక్కటేమిటి అన్ని పాత్రల్లోనూ మెప్పించగలడు. కానీ ఈ నేచురల్ స్టార్ కు ఎందుకో ఈ మధ్య కాలం కలిసి రావడం లేదు..గ్యాంగ్ లీడర్, వీ, టక్ జగదీష్, అంటే సుందరానికీ… వంటి సినిమాలు నానికి సరైన ఫలితాన్ని ఇవ్వలేదు..జెర్సీ కూడా కమర్షియల్ గా నిలబడలేదు.
ఇలాంటి సమయంలో నాని ప్రయోగం చేశాడు. దసరా రూపంలో ధరణిగా వచ్చాడు. తనను తాను పునర్ నిర్వచించుకున్నాడు. రూపాన్ని మార్చేశాడు. పక్కింటి అబ్బాయి అనే ట్యాగ్ లైన్ నుంచి బయటకు వచ్చేసాడు. పూర్తిగా వీర్లపల్లి యువకుడిగా మారిపోయాడు.. శ్రీకాంత్ ఓదెల చెప్పినట్టు చేశాడు.. దాని ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. థియేటర్ల లో శివాలూగే వాతావరణం కనిపిస్తోంది.
వాల్తేరు వీర నుంచి కలెక్షన్లు ఈ సినిమాకు వస్తున్నాయంటే ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. నానీ తన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడంతో థియేటర్లు హౌస్ ఫుల్ షో స్ తో దద్దరిల్లుతున్నాయి. ముఖ్యంగా యూఎస్ మార్కెట్ అయితే కనివిని ఎరుగని స్థాయిలో వసూళ్ళు కురిపిస్తోంది. ఈ కలెక్షన్లు ఇదే స్థాయిలో కొనసాగితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ దసరా విజయాన్ని పురస్కరించుకొని నానీ తన చేతిలో రెండు గొడ్డళ్లు పట్టుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాకపోతే ఈ ఫొటో జెర్సీ సినిమాలో నానీ రైల్వే స్టేషన్ కు వచ్చి అరిచే సీన్ లో రెండు చేతులు పిడికిలి బిగించి అరుస్తాడు. దసరా కు ముందు నానీ రీల్ కెరియర్ కూడా అలానే ఉంది. హిట్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూశాడు. ఆ కలను శ్రీకాంత్ నిజం చేశాడు. అందుకే నానీ భయ్యా నీ బాధలో అర్థం ఉంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.