A Hero in Depression : డెబ్యూ మూవీతోనే ఫేమస్ అయిన నటుల్లో ఆదిత్య ఓం ఒకరు. దర్శకుడు వైవీఎస్ చౌదరి ఆదిత్యను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు. ఆయన తెరకెక్కించిన మల్టీస్టారర్ లాహిరి లాహిరి లాహిరిలో మంచి విజయం సాధించింది. పేమ కథకు ఫ్యాక్షన్ జోడించి చక్కగా తెరకెక్కించారు. హరి కృష్ణ, సుమన్, వినీత్ లతో పాటు ఆదిత్య ప్రధాన పాత్ర చేశారు. కీరవాణి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది.హీరోయిన్ అంకిత గ్లామర్ హైలెట్ అని చెప్పాలి.
ఈ సినిమా తర్వాత ఆదిత్యకు వరుస ఆఫర్స్ వచ్చాయి. తెలుగులో పాతిక చిత్రాల వరకూ చేశారు. కానీ పరాజయాలు ఆయన్ని వెంటాడాయి. 2017 తర్వాత ఒక్కసారిగా వెండితెరకు దూరమయ్యారు. ఈ సమయంలో ఆయన ఎంతో వేదన అనుభవించినట్లు తాజాగా వెల్లడించారు. సోషల్ మీడియాలో కొందరు మీరు ఇంకా బ్రతికే ఉన్నారా? అని అడిగేవారట. ప్రతి ఒక్కరూ డిప్రెషన్ కి గురవుతారు. అలాగే నేను కూడా తీవ్ర మానసిక వేదన అనుభవించాను.
కుటుంబ సభ్యుల సహాయంతో బయటపడగలిగాను. ఒకప్పుడు నేను రోజుకు 60 సిగరెట్లు తాగేవాడిని. ఒకరోజు మద్యం, స్మోకింగ్ జోలికి పోకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పటి వరకు అదే మాటకు కట్టుబడి ఉన్నాను. 46 ఏళ్ల వయసులో కూడా ఇలా ఉన్నానంటే చెడు అలవాట్లు మానేయడమే కారణం కావచ్చు. చిత్ర పరిశ్రమలో ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. పొగడ్తలకు పొంగకుండా, విమర్శలకు క్రుంగకుండా ఉండాలని ఆదిత్య అన్నారు.
ఆదిత్య నటించిన లేటెస్ట్ మూవీ దహనం. ఈ మూవీ మార్చి 31న థియేటర్స్ లోకి వచ్చింది. దహనం అంతర్జాతీయ అవార్డులు అందుకున్నట్లు సమాచారం. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించారు. ఆదిత్య ఓం బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేశారు. ఆయన అక్కడ బిజీగా ఉన్నారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.