Ravipadu: వర్షాకాలంలో ఆ గ్రామస్తులు ఎవరైనా చనిపోతే వారికి నరకయాతనే. ప్రాణాలకు తెగించి అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి ఉంటుంది. నడుము లోతు నీటిలో మృతదేహాన్ని తరలించాలి. ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాలుగా ఇవే వెతలు. ప్రభుత్వాలు మారుతున్నా ఆ గ్రామానికి వంతెన నిర్మాణం అనే హామీ కార్యరూపం దాల్చడం లేదు. అదో ఎన్నికల హామీగా మిగిలిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి సమీపంలో గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తోంది. కంభం చెరువులో నీరు ఉన్నంతవరకు వాగు ప్రవహిస్తూనే ఉంటుంది. వాగుకు అవతల గ్రామ స్మశాన వాటిక ఉంది. దీంతో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు గ్రామస్తులు పడే బాధలు వర్ణనాతీతం. కేవలం ఈత వచ్చినవారే అంత్యక్రియలకు హాజరవుతుంటారు. ఇలా అంతిమ సంస్కారాలకు వాగు దాటే సమయంలో చాలాసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. గ్రామస్తులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎటువంటి నష్టం జరగలేదు. గత ఎన్నికలకు ముందు గుండ్లకమ్మ వాగు పై వంతెన నిర్మిస్తామని స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు హామీ ఇచ్చారు. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
ఇటీవల నల్లం వెంకటసుబ్బమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. అధికార పార్టీ సర్పంచ్కు ఆమె స్వయానా బంధువు. ఆమె అంత్యక్రియలకు గ్రామస్తులతో పాటు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అప్పటికే గుండ్లకమ్మ వాగు భారీగా ప్రవహిస్తోంది. నడుము లోతు నీటిలో ప్రమాదకర స్థితిలో మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించాల్సి వచ్చింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తక్షణం ప్రభుత్వం స్పందించి గుండ్లకమ్మ వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.