Vijayasai Reddy Land Grabs: మూడు రాజధానులకు మద్దతుగా గర్జించిన వైసీపీ నేతల్లో విజయసాయిరెడ్డి కనిపించలేదు. ఆయన కనిపిస్తే కోస్తా, రాయలసీమ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని భావించారో ఏమో కానీ ఆయన కార్యక్రమానికి ముఖం చాటేశారు. సాగరనగరంలో ఉండి బ్యాక్ స్క్రీన్ లో డైరెక్షన్ కే పరిమితమై ఉంటారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజల మనసులో ఏముంది తెలియదు కానీ.. విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావులాంటి వారికి మాత్రం ఇప్పుడు అర్జెంటుగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిపోవాలి. వారి భూములకు అమాంతం రేటు రావాలి. అయితే ఇందులో ధర్మాన ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్లొంటున్నా విజయసాయిరెడ్డి మాత్రం ఇన్నాళ్లూ అనుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ నేరుగా వచ్చి గర్జన చేయలేకపోతున్నారు. దానికి కారణం ఆయనపై భూదందా ఆరోపణలే కారణం. ఉత్తరాంధ్ర ప్రజల్లో టీడీపీ నేతలపై వ్యతిరేక భావన వచ్చేలా వైసీపీ ప్లాన్ చేసింది. అందుకు విరుగుడుగా టీడీపీ సేవ్ విశాఖ పేరిట వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డిని కార్నర్ గా చేసుకొని ఉద్యమిస్తోంది. దీంతో విజయసాయిరెడ్డిది కక్కలేక మింగలేని పరిస్థితి.

అసలు విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ముందుగా లాభపడేది విజయసాయిరెడ్డి, ఆయన కుమార్తె, అల్లుడే. సాగర నగరంలో అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా వందలాది ఎకరాలు సాయిరెడ్డి పోగేసుకున్నారు. సెంటు భూమి తన పేరిట ఉన్నా రాసిచ్చేస్తానని చెప్పుకొచ్చిన ఆయన ఏకంగా తన కుటుంబసభ్యుల పేరిట భూ సంతర్పణకు తెరలేపారు. నయానో..భయానో దారికి తెచ్చుకొనికారు చౌకగా భూములు కొట్టేశారు. అభ్యంతరాలు తెలిపితే పదుల సంఖ్యలో జేసీబీలు, బుల్టోజర్లకు పనిచెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఇలా బలవంతంగా సేకరించిన భూములు, బాధితుల వివరాలను ఈనాడు మీడియా బయటపెడుతోంది. సర్వే నంబర్లతో సహా వెల్లడించి ఈనాడు విజయసాయిరెడ్డిని విశాఖ నడిబొడ్డున నిలబెట్టింది.
వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా నియమితులైన విజయసాయిరెడ్డి తొలుత విశాఖలో ఎంటరయ్యారు. అటు తరువాత ఉత్తరాంధ్రకు తానే సీఎం, తానే మంత్రి అన్న రేంజ్ లో వ్యవహారాలను నడిపారు. తరువాత అల్లుడు, కుమార్తె విశాఖలోఅడుగు పెట్టారు. అవ్యాస్ పేరిట కంపెనీ ఏర్పాటుచేశారు. ఎక్కెడెక్కడో ఉన్న బ్లాక్ మనీతో భూములు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో ఎక్కడ భూమి ఖాళీగా కనబడితే దానిని కారుచౌకగా కొనుగోలు చేశారు. ఇందుకుగాను ప్రత్యేక బృందాన్నే నియమించుకున్నారు. ఎదురు తిరిగిన వారి భూములను 22ఏ జాబితాలో చేర్చి దారికి తెచ్చుకుని తమ పేరిట రాయించుకునేవారు. సాక్షాత్ ఆ పార్టీ ఎంపీయే దీనిని ధ్రువికరిస్తూ మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది.

అయితే ఇప్పుడు ఈనాడు వరుసగా ప్రచురిస్తున్న కథనాలు చూసి విశాఖ నగరవాసులు షాక్ కు గురవుతున్నారు. ఇంతలా భూదందా జరుగుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న వారు ఇలా కూడా చేయవచ్చా అన్న రేంజ్లో విజయసాయిరెడ్డి అండ్ కో భూదందాల వ్యవహారం సాగింది. అటు పొలిటికల్ సర్కిల్ లో కూడా ఇదే చర్చ నడుస్తోంది. విజయసాయిరెడ్డి ఎపిసోడ్ తో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానికి మద్దతుగా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నగరవాసులు మద్దతు తెలిపే పరిస్థితులు కనిపించడం లేదు. కళ్లకు కట్టినట్టు విజయసాయిరెడ్డి ఇన్ సైడ్ ట్రేడింగ్ కనిపిస్తున్నా ప్రభుత్వ పెద్దల్లో చలనం లేకపోతోంది. మున్ముందు ఇది వైసీపీ మెడకు చుట్టుకోవడం ఖాయంగా తెలుస్తోంది.