
పెళ్లిళ్లు దైవ నిర్ణయం అంటారు పెద్దలు. అందువల్లే కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా పెళ్లిళ్లు జరిగితే మరికొన్ని సందర్భాల్లో పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. తాజాగా కృష్ణా జిల్లాలో ఒక పెళ్లి సినిమా సన్నివేశాన్ని తలపించే విధంగా ఆగిపోయింది. పెళ్లి ఆగిన తరువాత ఊహించని రీతిలో బంధువులు భోజనాలు చేసి వెళ్లిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరుకు చెందిన ఒక యువకుడికి దూర ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.
నిన్న ఉదయం చర్చిలో యువతీయువకుల వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి తంతు మొదలైన కొంత సమయం తరువాత మత పెద్ద వరుడికి పెళ్లి సమ్మతమో కాదో అడిగాడు. వరుడు తనకు ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పాడు. అదే సమయంలో మత పెద్ద వధువును పెళ్లి ఇష్టమో కాదో అడగగా ఆమె మాత్రం ఇష్టం లేదని చెప్పింది. వధువు పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో మత పెద్దతో పాటు వధువు, వరుడి బంధువులను షాక్ కు గురి చేసింది.
మతపెద్ద వధువుకు ఇష్టం లేకుండా వివాహం జరిపించకూడదని ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోండని చెప్పారు. అనంతరం యువతి బంధువులు ఆమెకు నచ్చజెప్పి వివాహానికి అంగీకరించేలా చేశారు. అయితే యువకుడు తాను ఆ అమ్మాయిని వివాహం చేసుకోలేనని చెప్పాడు. దీంతో పెళ్లి ఆగిపోగా అప్పటికే భోజనాలు సిద్ధం కావడంతో వధువు, వరుడి తరపు బంధువులు భోజనాలు చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.