
డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసులను పేటీఎం తాజాగా ప్రారంభించింది. ఇకపై పేటీఎం వినియోగదారులు ఆధార్ కార్డు సహాయంతో నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ విచారణ, ఇతర లావాదేవీలను జరుపుకునే అవకాశం ఉంటుంది. నగదు డిపాజిట్, ఇంటర్‌బ్యాంక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ లాంటి ఫీచర్లు కూడా త్వరలో పేటీఎం వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.
పేటీఎం ఏఈపీఎస్ సర్వీసుల సహాయంతో ఆధార్‌తో అనుసంధానమైన దేశంలోని బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు ఇకపై క్యాష్ విత్‌డ్రాయెల్స్, బ్యాలెన్స్ విచారణ వంటి సేవలను పొందవచ్చని కంపెనీ తాజాగా ప్రకటన చేసింది. సెమీ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు, ఏటీఎంలు పరిమితంగా ఉండే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. దేశంలో ఆర్థిక సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఏఈపీఎస్ సర్వీసులను ప్రారంభించింది.
దేశంలోని మారుమూల ప్రాంతంలోని ప్రజలు పూర్తి బ్యాంకింగ్ సేవలను పొందగలిగేలా చూడటమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళుతున్నామని పేటీఎం చెల్లింపుల బ్యాంక్ సీఎండీ సతీష్ కుమార్ గుప్తా కీలక ప్రకటన చేశారు. 10,000కి పైగా వ్యాపార కరస్పాండెంట్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నామని చెప్పారు. పేటీఎం ప్రారంభించిన ఏఈపీఎస్ సర్వీసుల వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. భవిష్యత్తులో ఇతర సంస్థలు సైతం ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.