Generation Beta: మరో 24 గంటల్లో కొత్త ఏడాది వస్తుంది. ఈ ఏడాదికి ఒక కొత్త విశేషం ఉంది. జనరేషన్ ఆల్ఫాకు రేపటితో మానవాళి గుడ్ బై చెబుతుంది. ఆ తర్వాత కొత్త ఏడాదిలో జనరేషన్ బీటా కు స్వాగతం చెబుతుంది. 2025 -2039 గా జీవించే ఈ పిల్లలను జనరేషన్ బీటాగా చెబుతుంటారు. అధ్యయనకారుల లెక్కల ప్రకారం 2035 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభాలో జనరేషన్ బీటా పిల్లలు 16% దాకా ఉంటారు. వీరు విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆస్వాదిస్తారు. వసతులను పొందుతారు. అనేక సౌలభ్యాలను సొంతం చేసుకుంటారు. అన్నీ బాగుంటే వీరు 22వ శతాబ్దాన్ని కూడా చూస్తుంటారు. ఆ సమయం వరకు సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. వ్యక్తిగత జీవితం మరింత సుఖవంతం అవుతుంది. పీల్చే గాలి నుంచి విశ్రమించే పడక వరకు ప్రతి ఒక్కటి కొత్తగా ఉంటుంది. కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే సామెత ప్రతి సందర్భంలో వీరు నిజం చేసి చూపిస్తారు. తినే తిండిలో అత్యంత వైవిధ్యాన్ని వీరు ప్రదర్శిస్తారు. కార్బోహైడ్రేట్లను తగ్గించి.. ప్రోటీన్ ఫుడ్ ను కొంతవరకే పరిమితం చేసి.. శరీరానికి ఎంతో ముఖ్యమైన ఫైబర్, విటమిన్ ఫుడ్ ను ఎక్కువ తీసుకుంటారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ప్రయాణం చేస్తుంటారు.. కాలుష్యానికి దూరంగా.. హైడ్రో ఫోనిక్స్ విధానంలో పెరిగే మొక్కల మధ్య జీవిస్తారట.
సవాళ్లు కూడా అధికమే..
జనరేషన్ బీటా కాలాని కంటే మించి పోటీ పడుతుంది. వేగంతో పనిచేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని విధాలుగా ఉపయోగించుకుంటుంది. సరికొత్త లోకంలో జీవిస్తుంది. అలాంటప్పుడు జనరేషన్ ఆల్ఫాతో వీరికి ఇబ్బంది ఎదురవుతుంది. అయితే జనరేషన్ ఆల్ఫా అనుభవాన్ని మాత్రమే బీటా తరం ఉపయోగించుకుంటుంది. ఆ తర్వాత తమ జీవితానికి అనుకూలంగా మార్చుకుంటుంది. తద్వారా అన్ని రంగాలలో సరికొత్త విప్లవాలను సృష్టిస్తుంది. అయితే ఇదే సమయంలో వాతావరణం నుంచి ఈ తరానికి సవాళ్లు ఎదురవుతుంటాయి. వాతావరణ కాలుష్యం, కరువు కాటకాలు, అకాల వరదలు, ఆహార సంక్షోభం, అడవుల తగ్గుదల వంటివి ఈ తరాన్ని ఇబ్బంది పెడతాయి. అదే సమయంలో ఆటోమేషన్, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల ఉద్యోగాలు పోతాయి. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడం వల్ల మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోతాయి. అయితే మిగతా విషయాల్లో మాత్రం ఈ తరం అనేక మార్పులను చవిచూస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుఖవంతమైన జీవితాంతపాటు.. అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని వివరిస్తున్నారు. ఏది ఏమైనా ఈ తరం జీవిత విధానం సరికొత్తగా ఉంటుందని పేర్కొంటున్నారు.