Garikapati- Mega Fans: పబ్లిక్ లో మెగాస్టార్ చిరంజీవి పట్ల గరికపాటి నరసింహారావు వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతోంది. చిరంజీవి ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. చిరంజీవికి గరికపాటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన అలై బలై కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. అలాగే ప్రవచనకర్త, అవధాని గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు. గరికపాటి ప్రసంగిస్తూ ఉండగా… వేదికకు మరో వైపు చిరంజీవితో ఫోటోలు దిగడానికి మహిళలు పోటీపడ్డారు. చిరంజీవి చుట్టూ చేరి సెల్ఫీ దిగడం స్టార్ట్ చేశారు.

దానికది సమయం కానప్పటికీ అభిమానంతో వచ్చిన వారిని చిరంజీవి కాదనలేకపోయాను. త్వరగా ముగిద్దామనే ఆలోచనతో మహిళల కోరిక మేరకు వారితో ఫోటోలు దిగుతున్నారు. గరికపాటిని ఈ సంఘటన అసహనానికి గురి చేసింది. తన ప్రసంగాన్ని పట్టించుకోకుండా మహిళలు చిరంజీవితో ఫోటోలు దిగుతున్నారనే ఇగో ఆయన్ని రెచ్చగొట్టింది. దీంతో మైక్ లో పబ్లిక్ గా… చిరంజీవి గారు ఆ ఫోటో షూట్ ఆపాలన్నారు. మీరు ఫోటోలు దిగడం ఆపితే నా ప్రసంగం మొదలుపెడతా అన్నారు.
గరికపాటికి ఇబ్బందిగా ఉంటే ఎవరితోనైనా చెప్పి సమాచారం చిరంజీవికి చేరవేసి ఉంటే హుందాగా ఉండేది. అలా కాకుండా గరికపాటి మైక్ లో పబ్లిక్ గా తన అసహనం బయటపెట్టారు. గరికపాటి వ్యాఖ్యల అనంతరం చిరంజీవి ఫోటోలు దిగడం ఆపేసి పెద్దల వద్దకు వచ్చారు. గరికపాటి సహనం కోల్పోయినా చిరు హుందాగా వ్యవహరించారు. తన ప్రసంగంలో గరికపాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ప్రవచనాలు నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి, నా ఆలోచనలకు దగ్గరగా ఉంటాయన్నారు. ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడు అభినందించాను. ఒకసారి మా ఇంటికి పిలిచి సత్కరించుకుంటానని, వేదికపై చెప్పారు.

ఇక చిరంజీవి పట్ల గరికపాటి తీరును మెగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అంత పెద్ద స్టార్ గురించి గరికపాటి అలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి గరికపాటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆయన ప్రవచన కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.అలాగే మెగా ఫ్యాన్స్ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. కాగా చిరంజీవి తమ్ముడు నాగబాబు వెంటనే స్పందించారు. గరికపాటిపై పరోక్షంగా సెటైర్ వేశాడు.