Taptapani Waterfall: వేసవి కాలంలో నీరు వేడెక్కుతుంది. శీతాకాలంలో చల్లగా మారుతుంది. కానీ అక్కడ ఏడాది పొడవునా నీరు వేడిగానే ఉంటుంది. 360 రోజులు సమ ఉష్ణ స్థితిలో ఉంటుంది. వినడానికి కాస్తా వింతగా ఉంది కదూ. నిజమేనండీ.. శతాబ్దాల కాలం నుంచి ఆ జలపాతానిది అదే ప్రత్యేకం. శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దు ప్రాంతం ‘తప్తపాని’జలపాతానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉంది ఈ జలపాతం. తప్తపాని పట్టణం భారతదేశంలోని అతి తక్కువ వేడి నీటి సల్ఫర్ బుగ్గలలో ఒకటి. ఔషధ గుణాలకు పేరుగాంచిన ఈ సల్ఫర్ వేడి నీటి బుగ్గలో స్నానం చేయడం వల్ల అన్ని రకాల చర్మవ్యాధులు నయమవుతాయి. ఈ ప్రత్యేకతను గుర్తించిన ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటకంగాను అభివ్రద్ధి చేసింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 180 కిలోమీటర్ల దూరంలో…గంజాం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది తప్తపాని. ఇక్కడి జలపాతం నుంచి జాలువారే నీరు నిత్యం వేడిగా ఉంటుంది. వేసవిలో వెళ్లినా, కఠిక శీతాకాలంలో వెళ్లినా అదే వేడి కనిపిస్తుంది. శ్రీరామలింగేశ్వర స్వామి నడయాడిన నేలగా అక్కడి స్థానికులు అభివర్ణిస్తుంటారు. జలపాతం సమీపంలో రామలింగేశ్వర స్వామి ఆలయం కొలువై ఉంది. జలపాతం నుంచి జాలువారిన నీటిని కొలనుకు మళ్లించి భక్తుల పవిత్ర స్నానాలు చేయడానికి అనుమతిచ్చారు. ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తలు ఇక్కడికి వస్తుంటారు. కొలనులో వేడి నీటిలో స్నానమాచరిస్తుంటారు. ఈ నీటితో స్నానం చేస్తే శారీరక రుగ్మతలు దరిచేరవని భక్తుల ప్రగాడ నమ్మకం.
Also Read: Sudigaali Sudheer: పూర్ణకు ముద్దు పెట్టబోయిన సుధీర్.. ఫీల్ అయిన రష్మీ.. రోజా వార్నింగ్..
సరిహద్దు ప్రాంతం కావడంతో ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ గడ్ నుంచి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కార్తీక మాసంతో పాటు మహా శివరాత్రి పర్వదినం నాడు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. కార్తీక వన సమారాధనల సమయంలో ఇసుకేస్తే రాలనంత జనం హాజరవుతుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కేంద్రానికి చేరుకోవాలంటే రోడ్డు, రైలు మార్గాలున్నాయి. రైలులో చేరుకోవాలంటే ఇచ్చాపురం కానీ బరంపూర్ కానీ చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తప్తపాని చేరుకోవచ్చు. నిత్యం ప్రైవేటు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
రోడ్డు మార్గంలో చేరుకోవాలనుకున్న వారు. విశాఖ, శ్రీకాకుళంల నుంచి ఆర్టీసీ సర్వీసులు ఇచ్ఛాపురం వరకూ ఉంటాయి. ఇచ్చాపురం నుంచి గంట వ్యవధిలో తప్తపాని జలపాతానికి చేరుకోవచ్చు.