Traditional Cooking: ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆకలి వేస్తుంది. కాకపోతే వారికి ఉన్న ఆర్థిక స్థిరత్వం ప్రకారమే ఆహారం లభిస్తుంది. ఉదాహరణకు డబ్బున్న శ్రీమంతుడి డైనింగ్ టేబుల్ నిండా వంటకాలు ఉంటాయి. ఆ వంట చేసి పెట్టేందుకు పెద్దపెద్ద చెఫ్ లు ఉంటారు. అదే ఒక పేదవాడికి అలాంటి రాజ భోగాలతో కూడిన విందు లభించదు. పది వేళ్ళు పనిచేస్తేనే ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. ఒక్కోసారి ఆ పని లభించకపోతే మంచినీళ్లే పరమాన్నం అవుతాయి. అందుకే ఆకలి అందరికీ ఒకటే. కానీ లభించే ఆహారం మాత్రం వేరు.
అయితే ఈ ఆకలిని తీర్చుకునేందుకు ఒక్కొక్కరు ఒక్క విధమైన పద్ధతిని అవలంబిస్తుంటారు. తిని తిని లావైన వాళ్ళు తృణధాన్యాలు తింటారు. ఇక అడవుల్లో, కొండల్లో నివసించేవారు తమకు లభించిన ఆహారాన్ని తమదైన పద్ధతిలో వండుకుని తింటారు. అయితే సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత విభిన్న రకాలైన ఆహారపు అలవాట్లు మనకు పరిచయం అవుతున్నాయి. అయితే అందులో ఓ వృద్ధ జంట చేసుకున్న వంట ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనికోసం వారేమీ హంగు ఆర్భాటాలు చేయలేదు. ఖరీదైన సెట్టింగులు వేయలేదు. విఖ్యాత చెఫ్ లను తీసుకురాలేదు. జస్ట్ వారికి నచ్చిన వంట ను వారి పద్ధతిలో చేసుకున్నారు. కాకపోతే ఆ చేసిన విధానమే హైలైట్.
ఓ వృద్ధ దంపతులు అటవీ ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు. వారు నాటు కోళ్లను పెంచుకుంటూ ఉంటారు. అందులో ఒక కోడిని కోసి దానిని శుభ్రం చేశారు. ఈలోగా ఓ వృద్ధ మహిళ ఆ కోడిని వండేందుకు కావలసిన మసాలాలు మొత్తం చేతితో నూరింది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలను తనకు నచ్చిన విధంగా కోసుకుంది.. ఈలోపు ఆమె భర్త ఆ కోడి ని శుభ్రం చేసి ఆమెకి ఇచ్చాడు.. ఇప్పటిదాకా తాను సిద్ధం చేసిన మసాలాలను ఆ కోడికి ఆమె దట్టంగా పట్టించింది.. వెంటనే పోయి రాజేసి.. ఓ కుండలో ఆ కోడిని పెట్టి.. దానికి మూత పెట్టి.. దట్టంగా మంట మండించింది. కొద్దిసేపు అయిన తర్వాత ఆ కుండను దించింది. అందులో ఉన్న కోడిని బయటకు తీసి చూడగా బంగారు వర్ణంలో కనిపించింది. ఇంకేముంది ఆ భార్యాభర్తలిద్దరూ ఎదురెదురుగా కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఆరగించారు.. చదువుతుంటే పెద్దగా ఆశ్చర్యం అనిపించకపోయినప్పటికీ.. ఇందులో వింత ఏముంది అని అనిపించకపోయినప్పటికీ.. ఇద్దరు భార్యాభర్తలు కలిసి కూర్చొని తినడమే ప్రస్తుత రోజుల్లో అరుదయిపోయింది. ఫోన్ చూసుకుంటూ తినడం పరిపాటిగా మారింది. అంతేకాదు ఇంట్లో ఉండడం పూర్తిగా తగ్గిపోయి.. బయట తినడం అలవాటుగా మారింది. అడ్డమైన తిండ్లు తింటూ మనదైన ఆహారాన్ని మర్చిపోయి.. లేనిపోని రోగాలు తెచ్చుకోవడం రివాజుగా మారింది. మరి అలాంటి వారికి.. మనదైన ఆహారానికి దూరమైతున్న వారికి.. ఈ వృద్ద దంపతులు జస్ట్ తమ చేతల ద్వారా.. కష్టపడి, ఇష్టపడి వండుకుంటున్న వంట ద్వారా.. నేర్పిస్తున్న పాకశాస్త్ర పాఠాలు ఎన్నో.. వారిది కట్టెల పొయ్యి మాత్రమే కావచ్చు.. కానీ అది గ్రేట్ ఇండియన్ కిచెన్ అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.