Wedding Gift : సాధారణంగా మనకు తెలిసిన వారి పెళ్లి రిసెప్షన్లకు వెళితే.. ముందుగా దంపతులను ఆశీర్వదిస్తాం. మనకు తోచిన బహుమతులు అందిస్తాం. ఆ తర్వాత వివాహ విందును ఆరగిస్తాం. కానీ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బంజర గ్రామంలో ఓ యువకుడి వివాహ విందుకు హాజరైన అతని స్నేహితులు అదిరిపోయే బహుమతి ఇచ్చారు. ఆ బహుమతిని చూసి పెళ్ళికొడుకు అవాక్కైతే.. పెళ్లికూతురు ఆశ్చర్యపోయింది. ఇంతకీ వారు ఇచ్చిన బహుమతి ఏమిటో మీరూ చదివేయండి.
చికెన్ ప్రేమ్
ఎవరైనా కోడి మాంసాన్ని వారాంతంలో తింటారు. ఏవైనా పండుగలు, వేడుకల్లో తింటారు. అదే పనిగా చికెన్ తింటే దానిని ఏమంటారు.. పోనీ అతడిని ఏమని పిలుస్తారు.. ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం బంజర గ్రామానికి చెందిన బాదావత్ ప్రేమ్ కుమార్ రోజూ చికెన్ తింటాడు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో, మధ్యాహ్నం లంచ్ లో, రాత్రి డిన్నర్ లో చికెన్ లాగిస్తూ ఉంటాడు. మధ్యలో చికెన్ స్నాక్స్ పెట్టినా తింటూనే ఉంటాడు. అందుకే అతడికి “చికెన్ ప్రేమ్” అని స్నేహితులు ముద్దుగా పేరు పెట్టుకున్నారు. అలాంటి ప్రేమ్.. శనివారం బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన రావూరి పద్మజ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.
అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు
శనివారం పెళ్లయిన తర్వాత, ఆదివారం తన స్వగ్రామం బంజరలో ప్రేమ్ కుమార్ తన బంధువుల కోసం వివాహ విందు ఏర్పాటు చేశాడు. రిసెప్షన్ వేదికపై తన భార్యతో కలిసి వచ్చిన అతిధులతో ఫోటోలు దిగాడు. ఈలోగా అతడి స్నేహితులు వచ్చారు. నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో వారు తమ వెంట తెచ్చుకున్న ఒక సంచి నుంచి మూడున్నర కిలోల బరువు ఉన్న నాటు కోడిపుంజును బయటకు తీశారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్య పోవడం నూతన దంపతుల వంతయింది. అలా బయటికి తీసిన కోడిపుంజును ఆ దంపతులకు పెళ్లి బహుమతిగా ఆ స్నేహితులు అందజేశారు. చికెన్ అంటే ఇష్టం కాబట్టి తమ స్నేహితుడికి ఈ రూపంలో బహుమతి ఇచ్చామని స్నేహితులు పెళ్లికుమార్తెతో చెప్పారు. దీంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. ఇక ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో లో వైరల్ గా మారింది.