
మనకు ఈ భూమిపై జీవించే అదృష్టం ఉంటే ఎంత పెద్ద ప్రమాదంనుంచైనా ప్రాణాలతో బయటపడగలుగుతాం. తాజాగా నాలుగేళ్ల బాలుడు అలాంటి అదృష్టానికి ఉదాహరణగా నిలిచాడు. శిథిలాల కింద పడి 18 గంటలు ఉన్నా బాలుడు ప్రాణాలతో బయటపడగలిగాడు. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో సోమవారం సాయంత్రం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
భవనం కూలిన ఘటనలో దాదాపు 75 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎన్.ఢీ.ఆర్.ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు శిథిలాల కింద చిక్కుకున్న 60 మందిని రక్షించగా 13 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ శిథిలాల కింద మహ్మద్ నదీమ్ బంగి అనే నాలుగేళ్ల బాలుడిని భవనం కూలిన 18 గంటల తరువాత గ్యాస్ కట్టర్ల సహాయంతో కడ్డీలను తొలగించి బయటకు తీశారు. ఘోర ప్రమాదం జరిగినా బాలుడు ప్రాణాలతో బయటపడటం గమనార్హం. అయితే బాలుడు బయటపడినా అతని కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఈ ఘటన విషయంలో ఐదుగురిపై కేసు నమోదు చేయగా ఈ ఘటన తీవ్ర విషాదకరమైన విషయమని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో నిన్న రెండస్తుల భవనం కుప్పకూలగా శిథిలాల కింద నుంచి 9 మందిని వెలికి తీశారు.