Former: ఒక రైతుకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది?

రైతు ఆనందానికి చినుకులు కారణం కాదు. కరువుతో బీడుగా ఉన్న భూమిలో బోర్లు వేసిన ఆ రైతు.. ఒక బోరులో నీళ్లు పడడంతో పట్టలేనంత ఆనందంతో మురిసిపోయాడు.

Written By: Raj Shekar, Updated On : January 24, 2024 6:20 pm
Follow us on

Former: ఎండలకు ఎండిపోయి నెర్రెలుబారిన నేల తొలి చినుకు పడగానే పులకించిపోతుంది.. ఎండలకు మలమలా మాడిపోయిన మొక్కలు ఆనందంతో మురిసిపోతాయి. భూమిలో విత్తనాలు నేలతల్ల గర్భాన్ని చీల్చుకుని మొలకెత్తుతాయి. తొలి చినుకుల మట్టి పరిమళాలు సలక జీవరాసులను పులకింపజేస్తాయి. భవిష్యత్‌పై ఆశలు రేకెత్తిస్తాయి. కడుపునిండా వానలు కురిస్తే.. నేలతల్లి ఈనుతుందని, తమ రెక్కల కష్టం ఫలిస్తుందని రైతులు ఆశలు పెట్టుకుంటారు. అచ్చం ఇలాంటి ఆనందమే ఇక్కడ ఓ రైతు మోములో కనిపిస్తోంది.

బోరు సక్సెస్‌ కావడంతో..
ఆ రైతు ఆనందానికి చినుకులు కారణం కాదు. కరువుతో బీడుగా ఉన్న భూమిలో బోర్లు వేసిన ఆ రైతు.. ఒక బోరులో నీళ్లు పడడంతో పట్టలేనంత ఆనందంతో మురిసిపోయాడు. బోరు వేసే సమయంలో అక్కడే ఉన్న అన్నదాత మోములో ఎన్నడూ చూడని ఆనందం కనిపించింది. గలగల మంటూ భూగర్భంలోని గంగమ్మ పైకి వస్తుండడంతో పట్టలేని ఆనందంతో రైతు పక్కనే ఉన్న మరో రైతుతో సంతోషాన్ని పంచుకున్న తీరును చూసి రైతు కష్టం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆనంద భాష్పాలు రాలుస్తున్నారు. ఇంతకన్నా రైతుకు ఇంకే కావాలి. బతుకుమీద ఆశ, భవిష్యత్‌కు భరోసా ఇంతకన్నా ఏముంటుంది. ఇది కదా నిజమైన ఆనందం. ఇక కష్టాలు తీరినట్లే అన్న సంతోషం రైతు మోములో కనిపిస్తోంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
అయితే ఈ వీడియో ఎక్కడిదో తెలియదు. కానీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బోరు నుంచి నీళ్లు ఉబికి వస్తుంటే.. ఆ రైతు కళ్లలో నుంచి ఆనంద భాష్పాలు కూడా బోరు నీటితో పోటీ పడి వస్తున్నాయి. తన కష్టం ఫలించింది అన్న ఆనందం అన్నదాత మోములో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు లైక్, షేర్‌ చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. రైతన్నా.. విజయం నీదే.. ఇక నీకు తిరుగులేదు. భూమిలో బంగారం పండించు.. భూమిని నమ్ముకున్నోడు ఎన్నడూ నష్టపోడు.. రైతుకు ఇంతకన్నా సంతోషం ఏముంటుంది అని కామెంట్లు పెడుతున్నారు.