Mekathoti Sucharita: ఏపీలో అధికార పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. హైకమాండ్ కు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి., వసంత కృష్ణప్రసాద్.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీరోజూ ఎక్కడో ఒక చోట పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. అయితే ఇంతవరకూ ఎవరు పార్టీ మారడంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ తాజా మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె పార్టీ వీడడం ఖాయమన్నట్టు ప్రచారం సాగుతోంది. ఆమె వైసీపీ శ్రేణులతో సమావేశం, మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రాజకీయాల్లో ఉన్నంత వరకూ వైఎస్ కుటుంబాన్ని వీడనని చెప్పిన సుచరిత సడెన్ గా రూటు మార్చారు. గత ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుచరితను జగన్ తన కేబినెట్ లో తీసుకున్నారు. హోంశాఖను అప్పగించారు. చేతిలో కీలక శాఖ ఉన్నాఆమె అధికారాన్ని అనుభవించింది తక్కువే. హోంశాఖకు సంబంధించి అన్నిరకాల నిర్ణయాలు జగనో.. లేకుంటే ‘ఆ నలుగురు’ తీసుకునేవారు. కనీసం కానిస్టేబుల్ కు బదిలీ చేసే రైట్స్ లేకుండా సుచరిత మూడేళ్లు కాలం గడిపేశారు. మంత్రి హోదాతో సరిపెట్టుకున్నారు. కానీ ఎటువంటి అధికారం చెలాయించలేకపోయానన్న బాధ మాత్రం ఆమెను వెంటాడింది. అయితే మంత్రివర్గ పునర్విభజనతో ఆమె పదవి కోల్పోయారు. కనీసం మాట మాత్రం చెప్పకుండా తొలగించడంపై ఆవేదన చెందారు. అటు తన సామాజికవర్గానికి చెందిన మంత్రులను కొనసాగింపు ఇచ్చి.. తనకు ఉద్వాసన పలకడంపై నొచ్చుకున్నారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఇంతలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి మూన్నాళ్ల ముచ్చగా లాక్కున్నారు. దీంతో ఆమె మరింత నొచ్చుకున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం మానేశారు.

ఆమె పార్టీ మారడంపై రకరకాల ఊహాగానాలు వచ్చినా ఖండిస్తూ వచ్చారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ జగన్ వెంట నడుస్తామని ప్రకటించారు. కానీ రెండు రోజుల కిందట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుల వద్ద ఆమె మాట్లాడిన మాటలు తీరు చూస్తుంటే పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. ‘నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను.. నువ్వూ నాతో రా అంటే.. ఎంత రాజకీయ నాయకులినైనా భర్తతో వెళ్లాల్సిందేగా’ అని ఆమె అన్నారు. తన భర్త ఒక పార్టీలో, తాను మరొక పార్టీలో, తమ పిల్లలు వేరొక పార్టీలో ఉండరని.. ఉంటే అందరం ఒక పార్టీలోనే ఉంటామన్నారు. ఈ వీడియోలు గురువారం నాటికి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సుచరితపై మీడియా ఫోకస్ పడింది. ఆమె పార్టీ మారడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు.
సుచరిత భర్త దయాసాగర్ ఇన్ కం టాక్స్ ఆఫీసర్ గా పనిచేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయాలని భావిస్తున్నారు. టీడీపీ అయితే సానుకూలంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. గతం నుంచి టీడీపీ నేతలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వారి ద్వారా నాయకత్వాన్ని టచ్ లోకివెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. దయాసాగర్ పదవీవిరమణ చేసి టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా సుచరిత ఎటువంటి ఖండన చేయలేదు. పైగా భర్త వెంట నడుస్తానని చెబుతుండడంతో ఆమె పార్టీ మారడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే వైసీపీ నుంచి పడే తొలివికేట్ సుచరిత రూపంలోనేనని తెలుస్తోంది.