Telangana News Readers: తీన్మార్.. జోర్దార్… జబర్దస్త్.. గరం గరం.. పేరు ఏదైనా యాస, ప్రాస ఒక్కటే.. తెలంగాణ మాండలికంలో వార్తలు చదవడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి తెలుగు న్యూస్ చానెళ్లు.. వీ6 చానెల్ ప్రారంభించిన తీన్మార్‌తో మొదలైన తెలంగాణ మాండలిక వార్తలను.. తర్వాత అన్ని చానెళ్లు ప్రారంభించాయి. సరికొత్తగా, ప్రజా సమస్యసలను సామాన్యుడికి అర్థమయ్యేలా ఎత్తిచూపడం ద్వారా నిరక్షరాస్యులైన వీక్షకులను కూడా ఆకట్టుకుంటూ తమ రేటింగ్స్ పెంచుకున్నాయి. దీంతో తెలంగాణ మాండలికంలో అనర్గళంగా మాట్లాడగలియే న్యూస్ రీడర్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వివిధ చానెళ్లలో పనిచేసిన న్యూస్ రీడర్స్ కూడా వీక్షకుల నోళ్లలో నానేలా ముద్ర వేసుకున్నారు. తీన్మార్ వార్తలతో ఫేమస్ అయిన మల్లన్న(నవీన్) తీన్మార్ మల్లన్నగా, తర్వాత వచ్చిన శివజ్యోతి సావిత్రక్కగా, మంగ్లీ మంగోలిగా, బిత్తిరి బిత్తిరిగా మాట్లాడుతూ ఆకట్టుకున్న సత్తి విత్తిరి సత్తిగా, సదన్న, రమ్య, ధరణి ప్రియ, పద్మ, సుజాత, వాణి, రాజీ, రాజీవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది తెలంగాణ మాండలికంలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

తప్పుకుంటున్నారా.. తొలగిస్తున్నారా..
ప్రత్యేక వార్తలతో పెరిగిన రేటింగ్స్..
తెలంగాణ ఆవిర్భావానికి ముందే వీ6 చానెల్ తీన్మార్ పేరుతో తెలంగాణ మాండలిక వార్తల బులిటెన్ ప్రారంభించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రముఖ చానెళ్లన్నీ తెలంగాణ న్యూస్ బులిటెన్ ప్రారంభించాయి. అన్నీ అరగంట అటూ ఇటుగా ఒకే సమయంలో బులిటెన్ ప్రసారం చేస్తున్నాయి. దీంతో టీవీ చానళ్ల రేటింగ్ కూడా బాగా పెరిగింది. కొన్ని చానెళ్లు వీ6లో పనిచేసిన రీడర్స్‌కు ఎక్కువ వేతనం ఇచ్చి తమ చానెళ్లలో ఉద్యోగాలు ఇచ్చాయంటే తెలంగాణ మాండలికం ద్వారా ఆ చానెళ్లకు రేటింగ్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ చానెళ్లన్నీ ఇప్పటికీ బులిటెన్ కొనసాగిస్తున్నాయి.
ఒడిదుడుకులు ఎందుకో…
తెలంగాణ న్యూస్‌తో రేటింగ్స్ పెంచుకున్న టీవీ చానెళ్లు నేడు వాటిపై పెద్దగా దృష్టిపెట్టినట్లు కనిపించడం లేదు. ప్రసారం చేస్తున్నామా అంటే చేస్తున్నాం అన్నట్లుగా బులిటెన్ ఇస్తున్నాయి. ఇక న్యూస్ రీడర్స్ కూడా నేడు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఆ వార్తలు చదివే స్పెషల్ న్యూస్ రీడర్స్‌గా గుర్తింపు పొందిన వారు ఇప్పుడు న్యూస్‌లో కనిపించడం లేదు. యాజమాన్యాలు తొలగిస్తున్నాయా.. వాళ్లే తప్పుకుంటున్నారా.. కారణం తెలియదు కానీ ప్రముఖ చానెళ్లలో పనిచేసే రీడర్స్ కూడా ఇప్పుడు కనుమరుగయ్యారు.

సొంత చానెళ్లు..
తెలంగాణ న్యూస్ రీడర్స్‌లో కొందరు ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ చానెళ్లు పెట్టుకుని పనిచేస్తున్నారు. సొంతంగా వార్తలు చదువుతున్నారు. మరికొందరు వేర్వేరు అవకాశాలతో సినిమా, ఇతర రంగాలకు వెళ్లిలపోయారు. తీన్మార్ మల్లన్న తీర్మార్ వార్తల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత సొంతంగా న్యూచ్ చానెల్ ప్రారంభించారు. ఇక శివజ్యోతి(సావిత్రి) కూడా మొన్నటి వరకు టీవీ9 చానెల్‌లో పనిచేసి బయటకు వచ్చారు. సొంతంగా చానెల్ పెట్టుకుని హోంటూర్ వీడియోస్ చేస్తున్నారు. బిత్తిరి సత్తి కూడా తన యూట్యూబ్ చానెల్‌లో ప్రముఖుల ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సుజాత కామెడీ షోలలో చేస్తున్నారు. మంగ్లీ సినిమాలో పాటలతో, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో బిజీ అయ్యారు. ఇంకా కొందరు బయటకు వచ్చినా సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.
గుర్తింపు తక్కువే..
తెలంగాణ మాండలికంలో న్యూస్ రీడర్స్‌గా టీవీ చానెళ్లలో పనిచేసి తమకు, తాము పనిచేసిన సంస్థకు గుర్తింపు తెచ్చిన వారు ఇప్పుడు గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు. టీవీ చానెళ్లతో వచ్చిన గుర్తింపు, సొంత యూట్యూబ్ చానెళ్ల ద్వారా రావడం లేదు. దీంతో మళ్లీ తమకు మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూస్తున్నారు.