Fiber Cylinder: ఒకప్పుడు వంట చేసుకునేందుకు కట్టెల పొయ్యిలే దిక్కు. తర్వాత కిరోసిన్ స్టౌలు వచ్చాయి. కాలక్రమేణా గ్యాస్ స్టౌ లు రూపొందాయి. ధనిక, పేద తారతమ్యం లేకుండా దేశమంతటా ప్రతీ వంటింట్లో కొలువుతీరాయి. అయితే దీనిని వాడకంలో ఇప్పటికీ చాలామంది పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతిఏటా గ్యాస్ స్టౌ పేలుళ్ల వల్ల జరుగుతున్న ప్రమాదాలు వందల కోట్ల నష్టానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన ఫైబర్ సిలిండర్ ను రూపొందించింది. స్టీల్ తో తయారైన వంటగ్యాస్ సిలిండర్లతో పోలిస్తే తక్కువ బరువు, సురక్షితమైనవిగా చెబుతున్న ఫైబర్ సిలిండర్లు లేదా కాంపోజిట్ సిలిండర్లు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. ఆకర్షణీయమైన రంగు, డిజైన్, తక్కువ బరువు, వంటింట్లో మరకలు పడకుండా ఉండే స్వభావంతో పాటు, అనేక భద్రత ప్రమాణాలతో ఈ కొత్తరకం సిలిండర్ ను రూపొందించామని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెబుతోంది.
2021లో ప్రవేశపెట్టినా..
దేశంలోనే తొలిసారి ఈ తరహా సిలిండర్లను 2021లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రవేశపెట్టింది. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. మన ఇళ్లల్లో వాడే సాధారణ ఖాళీ సిలిండర్ బరువు 16 కేజీలు కాగా, అందులో నింపే గ్యాస్ బరువు 14 కిలోలు. మొత్తం బరువు 30 కిలోలు. భారతదేశంలో ఒక చిన్న కుటుంబం సరాసరి నెల గ్యాస్ వినియోగం 9 కిలోల వరకు ఉంటుంది. వీరిని దృష్టిలో పెట్టుకొని 10 కిలోలు, ఐదు కిలోల చొప్పున గ్యాస్ నింపేందుకు వీలుగా ఫైబర్ సిలిండర్లు రూపొందించామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెబుతోంది. పైగా ఇందులో గ్యాస్ పరిమాణాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. పది కిలోల గ్యాస్ పట్టే సిలిండర్ మొత్తం బరువు దాదాపు 16 కేజీలు ఉంటుంది.
పెట్రోలియం శాఖ నిర్వహించిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ నివేదిక ప్రకారం 2022 జనవరి 1 నాటికి దేశంలో 30. 53 కోట్ల యాక్టివ్ గృహ ఆధారిత గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వర్గాల లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫైబర్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య సుమారు లక్ష వరకు ఉంటుంది. ఇందులో తెలంగాణలో 12,000 ఆంధ్రప్రదేశ్లో 7,000 మంది వరకు వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం వాడుతున్న సంప్రదాయ సిలిండర్లు స్టీల్ తో తయారు చేస్తుండటంతో ఎక్కువ బరువు ఉంటున్నాయి. పైగా రెగ్యులేటర్ దగ్గర నిర్మాణపరమైన లోపాల వల్ల తరచూ గ్యాస్ లీక్ అవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఒక్కోసారి సిలిండర్లు పేలడంవల్ల భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. దీనిని నివారించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ఫైబర్ సిలిండర్లను తెరపైకి తీసుకొచ్చింది. వీటివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం లేదని చెబుతోంది. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంటింటికి నేరుగా పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తారు. మనదేశంలో కూడా ఇటువంటి విధానాన్ని తెరపైకి తీసుకురావాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుకుంటున్నది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించి, ఆ తర్వాత దేశం మొత్తం ఈ విధానాన్ని అవలంబించాలని అనుకుంటున్నది. నేరుగా పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తే వినియోగదారులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.