Tamil Nadu : వ్యవసాయం కష్టంగా మారుతోంది. ఎంత కష్టపడినా ఫలితం అంతంతే.. పైగా నష్టాలు. ప్రభుత్వాలు ప్రోత్సహించినా..సంప్రదాయ వ్యవసాయంతో చాలా మంది నపెద్దగా లాభాలు ఆర్జించడం లేదు. దీంతో చాలా మంది వ్యవసాయంవైపు మొగ్గు చూపడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఓ ఉద్యోగి ఏకంగా జాబ్ వదిలేశాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. జీవితాన్ని మార్చుకున్నాడు. నిరంతర కృషితో అద్భుతమైన మునగ వంగడాన్ని రూపొందించాడు. అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలిచాడు. అతనే అళగర్‌స్వామి. కొత్త వంగడంతో అలగర్ స్వామి వ్యవసాయ క్షేత్రం నర్సరీగా కూడా మారింది.
20 ఏకరాల్లో సాగు..
తమిళనాడుకు దిండిగల్ జిల్లా పల్లపట్టి గ్రామానికి చెందిన అళగర్‌స్వామి ఆర్ట్స్‌లో పీజీ చేశాడు. మక్కువతో వ్యవసాయం చేశారు. మొక్కుబడి వ్యవసాయం చేయకుండా నిరంతరం శాస్త్రవేత్తలను అనసరిస్తూ.. చర్చిస్తూ ఆధునిక వ్యవసాయం ఆకళింపు చేసుకున్నాడు. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. దిండిగల్–మధురై ప్రధాన రహదారికి పక్కనే ఉన్న 20 ఎకరాల బీడు భూమిని సాగులోకి తెచ్చే క్రమంలో మునగ వంగడం ఆవిష్కరించేందుకు కృషి చేశారు. 2002లో నూనత వండగాన్ని ఆవిష్కరించారు. రెండు స్థానిక కరాలను సంకరం చేసి ఈ వంగడం సృష్టించాడు. దీనికి తన పేరు వచ్చేలా పళ్లపట్టి అళగర్‌స్వామి వెళ్లిమాలై మురుగన్(పీఏవీఎం) అని పెట్టుకున్నాడు. తక్కువ నీటితో సాగు.. చీడపీడలు, తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడి ఇస్తుంది. సాగులోఉన్న రకాలకన్నా అధిక దిగుబడి వస్తోంది. ఈ విషయం ప్రచారం కావడంతో దేశవ్యాప్తంగా రైతులకు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మునగకు పుట్టినిల్లు అయిన ఉత్తర భారత దేశంలోనూ రైతులు మునగ సాగు చేయడం మొదలు పెట్టారు.
20 అడుగులకో మొక్క…
మునగను సేంద్రియ పద్ధతిలో సాగుచేసే పద్ధతులను అళగర్‌స్వామి అనుసరిస్తున్నాడు. పంచగవ్యను కనుగొన్న డాక్టర్ నటరాజన్‌తో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. పంచగవ్యను క్రమం తప్పకుండా వాడతారు. సాళ్ల మధ్య 20 అడుగుల ఎడం ఉండేలా మొక్కలు నాటుకోవాలి. దీంతో మొక్కలకు గాలి, వెలుతురు బాగా తగులుతుంది. ఎకరాకు 150 నుంచి 200 మొక్కలు నాటుకోవచ్చు.
లక్షల మొక్కల సరఫరా…
అళగర్‌స్వామి ప్రస్తుతం మునగ కాయలకన్నా నర్సరీపై దృష్టి పెట్టారు. 100 మంది కూలీలతో పల్లపట్టి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశారు. పీఏవీఎం మొక్కలను సరఫరా చేస్తున్నారు. 90 లక్షలకుపైగా మొక్కలను ఇప్పటి వరకు విక్రయించారు. ఏటా రూ.6 లక్షలకుపైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు.
ఐదేళ్లలో చెట్టుకు 3 క్వింటాళ్ల దిగుబడి..
ఇతర వంగడాలు నాటిన 9 నెలలకు కాపుకొస్తాయి. కానీ, పీఏవీఎం మునగ ఆరునుంచి ఏడు నెలలకే కాస్తుంది. ఐదేళ్లలో ఒక్కో చెట్టు మూడు క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఐదేళ్ల తోట నుంచి ఏటా 30 టన్నుల దిగుబడి వస్తుంది. సాధారణ రకాల దిగుబడి 20 టన్నులే. 20 నుంచి 25 ఏళ్లపాటు పంట దిగుబడి పొందవచ్చు.