
Pawan Kalyan- BJP: పవన్ కళ్యాణ్ ఏది చేసినా స్ట్రయిట్ గా ఉంటుంది. డొంకతిరుగుడు ఉండదు. వెనుక వ్యూహాలు అస్సలు కనిపించవు. తాను అనుకున్నది, చేయాల్సింది చాలా క్లారిటీగా చెబుతారు, చేస్తారు. కానీ ఏపీ ప్రయోజనాల విషయంలో చాలా లోతుగా ఆలోచించారు. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత భవిష్యత్ ను అంచనా వేసుకొని బీజేపీకి స్నేహహస్తం అందించారు. జగన్ ప్రజా వ్యతిరేక పాలన అందించే సమయంలో బీజేపీ హైకమాండ్ నియంత్రిస్తుందని భావించి నిర్ణయానికి వచ్చారు. బీజేపీ పెద్దలపై గౌరవభావంగా ఉండేవారు. ఇప్పటికీ ఉంటూ వస్తున్నారు. అందుకే పవన్ హైకమాండ్ పెద్దలు అదే భావంతో చూస్తూ వస్తున్నారు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఆ స్థాయిలో పవన్ ను అభిమానించడం లేదు. కలిసి పనిచేసేందుకు మొగ్గుచూపడం లేదు.
కలిసినా..కలిసి పనిచేయలేదు..
గత ఎన్నికల అనంతరం అటు బీజేపీకి, ఇటు జనసేనకు ఓటమి ఎదురైంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉండడం.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దారుణ పరాజయం చవిచూడడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేద్దామని జనసేన, బీజేపీ భావించాయి. వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి నిర్ణయించాయి. అయితే ఈ ఒప్పందానికి వచ్చాయి కానీ కలిసి పోరాడిన దాఖలాలు లేవు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల రూపంలో కలిసి నడిచేందుకు అవకాశం వచ్చినా రెండు పార్టీలు కలిసి పోరాటం చేయలేదు. ఇప్పటికీ బీజేపీ, జనసేన పొత్తులోనే ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం కలిసి పని చేయడం లేదు. రాష్ట్ర నాయకులతో తనకు గ్యాప్ ఉందని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. వారు వైసీపీపై పోరాటం చేయడం లేదని పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బీజేపీ నేతలు కూడా అడిగినప్పుడు కూడా జనసేన మద్దతు ప్రకటించలేదని.. పొత్తు ఉన్నా లేనట్లేనని ప్రకటించేశారు.
బీజేపీ పవన్ ఒప్పించగలరా?
ప్రస్తుతం పవన్ ఢిల్లీ టూర్ లో ఉన్నారు. బీజేపీ అగ్రనేతలను కలిసి చర్చలు జరుపుతున్నారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జితో రెండుసార్లు నాదేండ్ల మనోహర్ తో కలిసి పవన్ భేటీ అయ్యారు. అటు తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నడ్డాతో కేవలం అరగంట పాటే చర్చించారు. అయితే ఈ కీలక చర్చలన్నీ ఏపీలో వైసీపీని నియంత్రించేందుకేనని పవన్ స్పష్టం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదన్న ప్రయత్నంలో భాగమేనని చెప్పుకొచ్చారు. అంటే ఏపీలో విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి తేవడమేనని పవన్ మాటల ద్వారా తేలిపోయింది. అందుకే తాను బీజేపీకి ఒప్పించేందుకే వచ్చినట్టు చెబుతున్నారు. ఒక వేళ టీడీపీతో కాదని బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తే ప్రజావ్యతిరేక ఓటు చీలిపోతుందన్న విశ్లేషణ ఉంది. ఇప్పుడు పవన్ ఓట్లు చీలిపోనివ్వనని చెప్పడం, బీజేపీతో చర్చలు జరపడంతో కీలక కూటమి కోసమేనన్న కామెంట్స్ ఢిల్లీలో వినిపిస్తున్నాయి.

కొద్దిరోజుల్లో స్పష్టత..
బీజేపీ పెద్దలు పవన్ విషయంలో సానుకూలంగా ఉన్నారు. బలమైన మిత్రుడిగా భావిస్తున్నారు. అందుకే ప్రధాని మోదీ విశాఖ వచ్చినప్పుడు పవన్ ప్రత్యేకంగా ఆహ్వానించి చర్చించారు. ఇప్పుడు కేంద్ర పెద్దలు అంతా వరుస క్రమంలో కలుస్తున్నారు. కానీ ఏపీ బీజేపీ పెద్దలు మాత్రం పవన్ విషయంలో ఆ స్థాయిలో ఇంట్రెస్ట్ చూపడం లేదు. ప్రస్తుత జనసేన, బీజేపీ మధ్య ఉన్న గ్యాప్ నకు రాష్ట్ర నాయకులే కారణం తప్పించి.. జాతీయ నాయకులు కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ విషయంలో బీజేపీ వ్యవహార శైలి చూస్తుంటే.. ఏపీలో దూరంగా.. ఢిల్లీలో దగ్గరగా అన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. హైకమాండ్ పెద్దలు అనుకూలంగా ఉండడం, ఏపీ పెద్దలు అంత విముఖత చూపుతుండడంతో.. అసలు బీజేపీతో పవన్ సెట్ అవుతారా? లేదా? అన్న అనుమానం వెంటాడుతోంది. కొద్దిరోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.