
CM Jagan: రాజకీయాల్లో దూకుడు స్వభావం, మొండి వైఖరి ఒక్కోసారి లాభం చేకూర్చుతుంది.లేకుంటే పాతాళంలోకి నెట్టేస్తుంది. అయితే మన ప్రయత్నంలో కచ్చితత్వం, చిత్తశుద్ధి ఉంటే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ విషయంలో ఏపీ సీఎం జగనే చక్కటి ఉదాహరణ. ఆయన ఏమంత సీనియర్ కాదు. రాజకీయ పోరాటాలు చేయలేదు. కేవలం ఆయన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు మాత్రమే. అప్పుడే రాజకీయ అరంగేట్రం చేసి ఎంపీ అయ్యారు. తండ్రి మరణంతో అంతులేని సెంటిమెంట్ ను సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ దారుణంగా అణచివేశారని ప్రజలు నమ్మడంతో బలమైన నేతగా ఎదిగారు. సొంతంగా పార్టీని స్థాపించి అనతికాలంలోనే అధికారంలోకి రాగలిగారు. అయితే అధికారంలోకి రాక ముందు చూపిన దూకుడు, మొండి వైఖరి ఇప్పుడు కనబరుస్తుండడంతో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. గతంలో తనకు అండగా నిలిచిన వారు ఇప్పుడు దూరమవుతున్నారు.
ఆ ఘనతోనే పొలిటికల్ టర్నింగ్…
2010లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో చనిపోయే సమయమది. ఉమ్మడి ఏపీ సీఎంగా రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్ కావాలని కాంగ్రెస్ పార్టీ మెజార్టీ శ్రేణులు కోరుకున్నాయి. కానీ కాంగ్రెస్ హైకమాండ్ నో చెప్పింది. దీంతో తన తండ్రి మరణంతో చనిపోయిన వారి కుటుంబాలకుఅండగా నిలవాలని భరోసాయాత్ర చేసేందుకు జగన్ డిసైడ్ అయ్యారు. దానికి కూడా కాంగ్రెస్ హైకమాండ్ అడ్డుతగిలింది. యాత్ర చేపట్టవద్దంటూ ఆదేశాలిచ్చింది. పార్టీకి కాదూ కూడదని వెళితే జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయినాజగన్ వెనక్కి తగ్గలేదు. భరోసా యాత్ర చేపట్టారు. జైలు మెట్లు ఎక్కారు. జగన్ పొలిటికల్ కెరీర్ నే మార్చేసింది ఆ ఘటన. అప్పటి నుంచి నాయకుడిగా జగన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాకలు తిరిగిన యోథులు ఉన్నా.. ఒకేసారి ఎంపీ అనుభవంతో.. ఏకంగా ప్రతిపక్ష నేత.. అక్కడ నుంచి సీఎం పీఠం సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు అలా చేస్తే కుదురుతుందా?
అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. నాటి దూకుడు కనబరుస్తామంటే కుదరని పని. కానీ అదే దూకుడుతో ముందుకు సాగాలనుకుంటున్న జగన్ కు ఇప్పుడు ప్రతికూల ఫలితాలు పలకరిస్తున్నాయి. అయినా వెనక్కితగ్గడం లేదు. సాహసోపేత నిర్ణయాలతోనే మరోసారి రాటు దేలాలని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే ఏం జరిగినా తాను సిద్ధమేనన్నట్టు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేల రూపంలో ధిక్కారాలు ఎదురైనా.. ప్రత్యామ్నాయ నాయకులతో ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నారు. అయినా ఇప్పుడున్న సిట్యువేషన్ లో కఠినంగా వ్యవహరించక తప్పని పరిస్థి తి జగన్ కు ఎదురైంది. అందుకే లాభ నష్టాలను భేరీజు వేసుకోకుండా తనకు తెలిసిన దూకుడుతోనే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇది విజయం చేకూరుస్తుందో.. లేక మూల్యానికి బలి కావాల్సి ఉంటుందో చూడాలి మరీ.

తగ్గినట్టే తగ్గి…
ఇటీవల వర్కు షాపులో జగన్ కీలక ప్రసంగం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలు, మంత్రులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీని ధిక్కరించిన నలుగురు ఎమ్మెల్యేల విషయం పరోక్షంగా ప్రస్తావించారు. ఈ క్రమంలో పార్టీతో పాటు ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. వచ్చే ఎన్నికల్లో 60 మందికి సీట్లు ఇవ్వరని ప్రచారం చేస్తున్నారని.. అందులో నిజం లేదని తేల్చారు. ఏ ఒక్కర్నీ వదులుకోవడం తానకు ఇష్టం లేదని.. ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటానని చెప్పారు. అయితే ఇక్కడే జగన్ తన చతురతను ప్రదర్శించారు. ఏ ఒక్కర్నీ వదులుకోనని చెప్పారే కానీ.. అందరికీ టిక్కెట్లు ఇస్తానని మాత్రం చెప్పలేదు.పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నా..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత పరాజయం ఎదురైనా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గిన సందర్భాలు కనిపించలేదు. సో తన వెంట ఉండేదెవరు అనే దాని కంటే.. తాను దూకుడుగా మరోసారి ముందుకెళతానని జగన్ నిర్మోహమాటంగా చెప్పేశారన్న మాట.