
Valentine Day 2023: ప్రేమంటే తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా ఒక మనిషిని యధాతధంగా అంగీకరించడం. అలాంటి ప్రేమ నిలబడుతుంది.. కలబడినా కలకాలం వర్దిల్లుతుంది. ప్రేమ దేన్నైనా ఎదిరిస్తుంది.. దేని కోసమైనా తెగిస్తుంది. ఎప్పుడో కన్నుమూసిన వాలెంటైన్ జ్ఞాపకార్ధంగా ప్రేమికుల రోజు నేటికీ జరుపుకుంటున్నామంటే దానికి ప్రేమలో ఉన్న ఔన్నత్వమే కారణం.. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రేమ రూపం కూడా మారుతున్నది..ప్రే అంటే ప్రేమించడం, మ అంటే మర్చిపోవడం అనే స్థాయికి పడిపోయింది. ప్రేమ అంటే మఘ లో పుట్టి పుబ్బలో ముగిసేది కాదు. అదో ఆ వ్యాజమైన భావన. ఈ వాలెంటైన్స్ డే నాడు మీ ప్రేమను ఎలా కాపాడుకోవాలో, ఎలాంటివి చేయకూడదో ఈ కథనం చదివి తెలుసుకోండి.
ప్రేమ అనేది స్వచ్ఛమైన పాల లాంటిది.. అందులో పంచదార వేస్తే తీయగా మారుతుంది..విషం చుక్కలు విస్తే విరిగిపోతుంది. మనం ఎలా ఉంటే ప్రేమ అలా ఉంటుంది. ఆత్మీయంగా దగ్గర కు తీసుకుంటే పరిష్వంగన ఆవుతుంది..అందుకే మీ ప్రియమైన వారితో చక్కగా మాట్లాడండి. ఇంట్లో వాళ్ళను కాదని మిమ్మలని ప్రేమిస్తున్నారూ అంటే వారి దగ్గర లభించనిది మీ దగ్గర ఏదో ఉన్నట్టే కదా! ముందు మీరు అది ఇచ్చే ప్రయత్నం చేయండి.. అంతే గానీ మీ దగ్గరకు వచ్చారు అని చులకనగా చూడకండి. దెప్పి పొడిచినట్టు మాట్లాడకండి. ఒక ఆత్మీయ పలకరింపు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది. అదే ఓ చీత్కరింపు మనిషిని కుంగదీస్తుంది.

ఈ వాలెంటైన్ డే నాడు మీ ప్రియమైన సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్ళండి.. బైక్ మీద అయితే ఇంకా బాగుంటుంది. చనువు ఇచ్చారు కదా తనువు కు పని చెప్పకండి. ఒక మంచి బహుమతి ఇవ్వండి. వారితో ఉన్న అనుబంధాలను షేర్ చేసుకోండి. జ్ఞాపకాలను నెమరు వేయండి. వారికి ఇష్టమైన పాటలు వినిపించండి. నచ్చిన ఫుడ్ తినిపించండి..డ్రెస్ కొనిపెట్టండి. అంతే గానీ మొక్కు బడిగా విషెస్ చెప్పకండి. ఇంకొకరితో పోల్చుకుని వితండ వాదం పెట్టుకోకండి. మొరటు గా మాట్లాడకండి. అలాంటివి ఎదుటి వారిని హర్ట్ చేస్తాయి. వారి ఫీలింగ్స్ కు రెస్పెక్ట్ ఇవ్వండి. భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో పంచుకోండి. అప్పుడే మీ ప్రేమ మరింత చిక్క బడుతుంది. పది కాలాల పాటు నిలుస్తుంది.