150 maggots from patient nose Viral: కరోనా సోకింది. స్టెరాయిడ్లు ఇవ్వడంతో అనంతరం సైడ్ ఎఫెక్ట్ లు దాడి చేశాయి. బ్లాక్ ఫంగస్ కు చికిత్స తీసుకుంది. అయినా కూడా ఆ మహిళను రోగాలు వదల్లేదు. మ్యూకోర్మెకోసిస్ సోకింది. ఆమె ముక్కులో ఈగలు 150 గుడ్లు పెట్టాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆపరేషన్ చేసి 150 ఈగ లార్వాలను ఆమె ముక్కు నుంచి తొలగించారు. ఆమె ముక్కులో వాటిని చూసి వైద్యులే ఆశ్చర్యపోయిన పరిస్థితి నెలకొంది.
ఏపీలోని గుంటూరుకు చెందిన 50 ఏళ్ల గృహిణిని ఆస్పత్రికి తరలించారు. ఆమె సెమీ కోమా స్థితిలో ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే మహిళకు 6 నెలల క్రితం కోవిడ్ సోకింది. తర్వాత మ్యూకోర్మెకోసిస్ అభివృద్ధి చెందింది. ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపించడంతో ఆమె కుడి కన్ను తొలగించాల్సి వచ్చింది. కోవిడ్ తో మూత్రపిండాల పనితీరు కూడా దెబ్బతింది. మధుమేహానికి దారితీసింది.
పరిస్థితి విషమించగా హైదరాబాద్ లోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. రోగిని పరీక్షించగా ఆమె మెదడుకు దిగువన ఈగల లార్వాల సమూహం కనిపించింది. వైద్యులు, నెఫ్రాలజిస్టుల బృందం ఆమె ఆరోగ్య పరిస్తితిని మెరుగుపరిచి లార్వాలను బయటకు తీసే ఆపరేషన్ చేశారు.
సెంచురీ ఆస్పత్రిలో ఈఎన్టీ, స్కల్ సర్జన్ లు కలిసి ఈ ఆపరేషన్ చేసి 150 లార్వాలను బయటకు తీశారు. ఆస్పత్రి డాక్టర్ మాట్లాడుతూ.. ‘మన చర్మంపై ఈగలు,దోమలు వాలితే గుర్తించి తరిమికొడుతాం.. కానీ మ్యూకోర్మెకోసిస్ రోగులు స్పర్శ కోల్పోవడంతో ఇలా ఈగలు ముక్కులోకి ప్రవేశించి ఆమె ముక్కులో గుడ్లు పెట్టాయి. ఇవి మెదడులోకి ప్రవేశించి మెనింజైటిస్ కు కారణమవుతాయి అని వివరించారు. ఆపరేషన్ తో వాటిని తొలగించామని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.