
Mahashivratri Fasting: మహాశివరాత్రి పండుగను జరుపుకోవడంలో మూడు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి, స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివ భక్తులను పూజించి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసుకోవాలి. ఇది శివార్చన.. ఇక రెండవది ఉపవాసం. ఉపవాసం అంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణ చేయటం. మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలుకొని సూర్యోదయం వరకు నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి పునర్జన్మ ఉండదని స్కంధ పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామస్మరణం స్మరణం సమస్త పాపాలను నశింప చేస్తుంది. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలు, ఎలాంటి ప్రయోజనం లేని వాటిని చూస్తూనో కాకుండా శివ నామాన్ని స్మరిస్తూ, శివ గాథలను చదువుకుంటూ, శివ లీలలను చూస్తూ చేసినట్లయితే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. ఇక పుణ్యం, పురుషార్ధం రెండూ లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.
శివరాత్రిని యోగ రాత్రి కూడా పిలుస్తారు. శివరాత్రి రోజుకి ప్రకృతిలో ఉన్న తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.. శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి నాడు అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణులు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్లకు శాస్త్రం మినహాయింపు ఇచ్చింది. ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం తినకూడదు. మద్యపానం చేయకూడదు.. ఎలాగూ ఉపవాసం చేస్తున్నామని ఆలస్యంగా నిద్రలేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, తల పైనుంచి స్నానం చేసి, ఈరోజు నేను శివునకు ప్రీతికరంగా, శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి.

ఉపవాసం అనే పదానికి దగ్గరగా ఉండటం అనే అర్థం వస్తుంది. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంలో పాటు ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నేను కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు.. అలా చేయకూడదు కూడా. శరీరాన్ని కష్టపడుతూ, భగవంతుడు వైపు మనసు మళ్లించడం చాలా కష్టం. శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం మంచిది. అంతేకాదు జాగారం ఉంటే శివ పంచాక్షరి మంత్రంలో ధ్యానం చేయడం వల్ల ఎంత మేలు జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే మహాశివరాత్రి నాడు నమశ్శివాయ అంటూ శివాలయాలు మారు మోగి పోతాయి. “త్రయంబకం యజామహే” అంటూ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగ బాధలు తగ్గి పూర్ణ ఆయుష్షు లభిస్తుందని ప్రతితీ.