Director Anurag Kashyap: బాలీవుడ్ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది. సౌత్ సినిమా డామినేషన్ పరిశ్రమపై పెరిగిపోయింది. హిందీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కనీస ప్రభావం చూపలేకపోతున్నాయి. ఏడాది కాలంలో సౌత్ ఇండియాకు చెందిన పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్, కాంతార, కార్తికేయ 2 నార్త్ బాక్సాఫీస్ దున్నేశాయి. అదే సమయంలో అక్కడి భారీ బడ్జెట్ చిత్రాలు చతికిలపడ్డాయి. అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, జాన్ అబ్రహం, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ నటించిన భారీ, మీడియం బడ్జెట్ చిత్రాలు బోల్తా కొట్టాయి.

ఓటీటీ కారణంగానే ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదని సమర్ధించుకుందాము అనుకుంటే… సౌత్ చిత్రాలు రికార్డు వసూళ్లు సాధించడం బాలీవుడ్ మేకర్స్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అవుతుంది. సౌత్ ఇండియా ప్రాభవాన్ని, గొప్పతనాన్ని ఒప్పుకోలేని హిందీ వర్గాలు సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారు. బాహుబలి సిరీస్ విజయం గాలివాటమే అని ఎద్దేవా చేసిన బాలీవుడ్ ఇండస్ట్రీకి తాజా సౌత్ విజయాలు నోరుమూపించాయి.
అసలు సౌత్ కథల్లో ఉందేమిటీ, నార్త్ కథల్లో లేనిదేమిటి? పొరుగింటి పుల్ల కూర మన ప్రేక్షకకులకు అంతగా నచ్చడానికి కారణాలు ఏమిటని ఆత్మపరిశీలనలో పడ్డారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన అనురాగ్ కశ్యప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ కి కావలసింది పుష్ప, కాంతార, కెజిఎఫ్ లాంటి కథలు కాదన్నారు. వాటిని అనుకరించి సినిమాలు చేస్తే బాలీవుడ్ మరింత నష్టపోతుందని వెల్లడించారు.

కొత్త కథలు రావాలి. సరికొత్త కంటెంట్ ప్రేక్షకుడికి ఇవ్వగలితే విజయం సాధించగలమని ఆయన చెప్పుకొచ్చారు. సౌత్ ఇండియా మాస్ కథలు అనుకరిస్తే విజయాలు సొంతమవుతాయి అనుకోవడం అపోహే అని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి సౌత్, నార్త్ నేటివిటీకి… కథలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల ప్రేక్షకుల అభిరుచులు కూడా వేరు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి కొంచెం యూనివర్సల్ టచ్ ఉన్న కథలు సక్సెస్ అయ్యాయంటే అర్థం వుంది. పుష్ప, కాంతార చిత్రాలు ఫక్తు ఒక ప్రాంతానికి చెందిన కథలు. అవి బాలీవుడ్ లో విజయం సాధించడం మేకర్స్ ని అయోమయంలోకి నెడుతుంది. కాంతార చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖులు మెచ్చుకున్నారు. హ్రితిక్ రోషన్ అద్భుతం అంటూ కొనియాడారు.