Anudeep Kv: జాతిరత్నాలు మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు అనుదీప్ కేవీ. జాతిరత్నాలు సంచలన విజయం నమోదు చేసింది. రూపాయి పెట్టుబడికి ఐదు రూపాయల లాభం తెచ్చిపెట్టింది. ఒక కామెడీ సినిమా ఆ స్థాయి విజయం అందుకోవడం ఈ మధ్య కాలంలో లేదు. సిల్లీ పాయింట్ చుట్టూ నాన్ స్టాప్ కామెడీ పంచి అనుదీప్ సక్సెస్ అయ్యాడు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలతో పర్ఫెక్ట్ క్యాస్టింగ్ సెట్ కావడం బాగా కలిసొచ్చింది.

అనుదీప్ కి పాపులారిటీ తెచ్చి పెట్టిన మరొక అంశం సెన్సాఫ్ హ్యూమర్. అమాయకంగా మొహం పెట్టి అనుదీప్ పేల్చే టైమింగ్ జోక్స్ ఓ రేంజ్ లో పేలతాయి. యాంకర్ సుమను చూస్తే అందరికీ భయం. ఆమెకే ఝలక్ ఇచ్చిన ఘనత అనుదీప్ కి దక్కుతుంది. క్యాష్ షోలో అనుదీప్ చేసిన హంగామా కావలసినంత ఫన్ పంచింది. ట్రోలర్స్ కి గంపల కొద్దీ కంటెంట్ దొరికింది. ఇక యాంకర్ ప్రేమతో అనుదీప్ ఇంటర్వ్యూ చూశాక ఆయన పట్ల అప్పటి వరకున్న అభిప్రాయం మారిపోయింది.
తింగరిగా కనిపించే అనుదీప్ లో ఇంత విషయం ఉందా అని ప్రేక్షకులు తెల్లబోయారు. ఆయనకు చాలా విషయాల్లో లోతైన అవగాహన ఉందని తెలుసుకున్నారు. జాతిరత్నాలు హిట్ ఏదో గాలి వాటం కాదన్న అభిప్రాయానికి వచ్చారు. కాగా అనుదీప్ లో తెలుసుకోవాల్సిన ప్రత్యేకతలు ఇంకా ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనుదీప్ చెప్పులు వాడరు. ఆయన ఎక్కడికైనా వట్టి కాళ్ళతోనే ప్రయాణం చేస్తారు. దీనికి ఒక బలమైన కారణం ఉందట.

ప్రముఖ రచయిత క్లింట్ ఉబెర్ రాసిన ‘ఎర్తింగ్’ అనే మోస్ట్ సెల్లింగ్ పుస్తకాన్ని అనుదీప్ చదివాడట. ఆ పుస్తకం ప్రకారం లోకంలోకి సింథటిక్ వచ్చాక భూమికి, మనుషులకు కనెక్షన్ పోయిందట. చెప్పులు ధరించడం ద్వారా భూమితో మనుషులు అనుబంధాన్ని, ఆరోగ్యప్రయోజనాలను కోల్పుతున్నారనేది అనుదీప్ నమ్మకమట. అప్పటి నుండి అనుదీప్ చెప్పులు ధరించడం మానేశాడట. కాగా అనుదీప్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. కాఫీ, జ్యూస్ వంటి ఆహార పదార్థాలు ఆయన ఒంటికి పడవట. ఘాటైన వాసనలు, కాంతివంతమైన లైట్స్ ఇబ్బంది పెడతాయట.