Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైనప్పుడు ఇంట్లో ఎవరూ లేరని.. ఆ సమయంలో పెద్ద కుమారుడు (elder son) ఇబ్రహీం తన తండ్రిని గుర్తించాడని.. వెంటనే ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పెద్ద కార్ల షెడ్డే ఉంది. అందులో అత్యంత విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అయినప్పటికీ ఇబ్రహీం ఆటోలో సైఫ్ అలీ ఖాన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లడం రకరకాల చర్చలకు కారణమయ్యాయి. అయితే సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా కత్తి పోట్లకు గురి కావడం.. రక్తం విపరీతంగా కారడం.. ఆ సమయంలో అంబులెన్స్ కు ఫోన్ చేయడం లేదా షెడ్డు కి వెళ్లి కార్లను తీసుకురావడం వల్ల సమయం వృధా అవుతుందని భావించి.. ఇబ్రహీం వెంటనే సైఫ్ అలీ ఖాన్ ను అమాంతం తన భుజాల మీద మోసుకెళ్లి.. ఆటోలో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటనలో మరో నిజం వెలుగులోకి వచ్చింది.
తీసుకెళ్ళింది ఇబ్రహీం కాదా?
సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన తర్వాత అతడిని మొదటి భార్య కుమారుడు ఇబ్రహీం ఆస్పత్రికి తీసుకెళ్లడాని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే సైఫ్ వెంట ఏడు సంవత్సరాల కుమారుడు తైమూర్ కూడా వచ్చాడట. ఆసుపత్రికి వస్తున్నప్పుడు సైఫ్ ఒళ్ళు మొత్తం రక్తమే ఉంది. ఆ రక్తం వల్ల సైఫ్ జుట్టు కూడా తడిసిపోయింది.. ఏడు సంవత్సరాల కుమారుడు సైఫ్ తో కలిసి రావడాన్ని ఆసుపత్రి వర్గాలు కూడా ఆశ్చర్యంగా చూశాయి. ” సైఫ్ ఒళ్ళు మొత్తం రక్తమే.. జుట్టు కూడా తడిసిపోయింది. ఈ క్రమంలో అతడి ఏడు సంవత్సరాల కుమారుడు తైమూర్ కూడా సైఫ్ వెంట ఉన్నాడు. ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. గాయపడిన ఆ వ్యక్తిని నేను ముందుగా సైఫ్ అనుకోలేదు. ఆసుపత్రికి వెళ్ళగానే దిగుతుంటే అతడు సైఫ్ అని గుర్తించాను. ఆ ఏడు సంవత్సరాల కుమారుడు తైమూర్ అని తర్వాత తెలిసింది. ఆటోలో ప్రయాణం చేస్తున్నంత సేపు ఏడు సంవత్సరాల పిల్లోడు ఆందోళనలో ఉన్నాడు. త్వరగా గమ్యం చేరుకోవాలని ఆత్రుత అతనిలో ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లి తన తండ్రి ప్రాణాలను దక్కించుకోవాలని తలంపు అతడిలో కనిపించింది. ఇబ్రహీం కంటే ఎక్కువ ఒత్తిడి ఆ పిల్లాడు అనుభవించడం నేను చూశానని” ఆ ఆటో డ్రైవర్ పేర్కొన్నాడు. సైఫ్ ఘటన అనంతరం ఆ ఆటోడ్రైవర్ ను ఇంటర్వ్యూ చేయడానికి జాతీయ మీడియా సంస్థలు పోటీపడ్డాయి. ఆ సమయంలో ఆటోను అటువైపు తీసుకురావడం.. గాయాలతో విలవిలలాడుతున్న వ్యక్తిని ఆసుపత్రి దాకా తీసుకెళ్లడం.. చాలాసేపటి దాకా అక్కడ ఉండడంతో ఆ ఆటో డ్రైవర్ కాస్త హీరో అయిపోయాడు. సైఫ్ అలీ ఖాన్ ప్రాణాలు కాపాడిన దేవుడిగా నిలిచిపోయాడు. అందువల్లే అతడిని జాతీయ మీడియా వెయ్యినోళ్ల కీర్తిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ అభిమానులు కూడా అతడిని అభినందిస్తున్నారు.