Tamil Nadu: సోషల్ మీడియా వచ్చాక.. అందులోని వీడియో చూసి ప్రయోగాలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. రీల్స్ కాపీ కొట్టడంతోపాటు.. చిట్కాలు, గృహోపకరణాలు తయారు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కొంత మంది యూట్యూబ్ చూసి దొంగతనాలు నేర్చుకుంటున్నారు. కొందరు హత్యలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. కానీ, ఓ భర్త తన భార్యకు నార్మల్ డెలవరీ కావాలని యూట్యూబ్ చూసి డెలివరీ చేయడానికి యత్నించాడు. ఈ ప్రయోగం వికటించింది. చివరకు అది ఆమె ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో జరిగింది.
అన్నీ సహజ పద్ధతిలో కావాలని..
లోకనాయకి అనే యువతికి మాదేశ్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అగ్రికల్చరల్ బీఎస్సీ చేసిన దంపతులు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ సహజమైన పద్ధతిలో జీవించాలని ఇంటి ఆవరణలో సేంద్రియ విధానంలో ఆకు కూరలు, కూరగాయలు పండిస్తూ వాటినే తింటున్నారు. లోకనాయకి గర్భవతి కావడంతో ..ఆమె సహజ పద్ధతిలో ప్రసవించాలని మాదేశ్ తెలిసి తెలియని పని చేశాడు. యూట్యూబ్‌లో నార్మల్ డెలవరీ వీడియో చూస్తూ భార్యకు పురుడు పోయాలనుకున్నాడు. అతని ప్రయోగం వికటించడంతో అధిక రక్తస్రావమైంది. చివరకు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ లోనకాయకి ప్రాణాలు విడిచింది.
ఇంటినే హాస్పిటల్‌గా మార్చాడు..
అతనికి అవగాహన లేకపోవడమో లేదా అతిక తెలివో కానీ ..కట్టుకున్న భార్యకు తానే ట్రీట్‌మెంట్ చేయాలని ఇంటిని హాస్పిటల్‌గా మార్చాడు. ఆరోగ్య సూత్రాలు పాటించే ఈదంపతులు.. ప్రసవం విషయంలో కూడా డాక్టర్లపై ఆధారపడకుండా ..సహజ పద్దతిలో బిడ్డకు జన్మనివ్వాలని ఇంట్లోనే ప్రసూతి ఏర్పాట్లు చేసుకున్నారు. భర్తపై నమ్మకంతో లోకనాయకి కూడా భర్త డెలివరీ చేస్తానంటే అంగీకరించింది. యూట్యూబ్‌లో నార్మల్ డెలవరీ విధానం వీడియో చూస్తూ లోకనాయకి ప్రసవం చేశాడు.
పుట్టగానే తల్లిని కోల్పోయిన పసిబిడ్డ..
ఇంతవరకు బాగానే ఉంది. బిడ్డ ప్రసవించిన తర్వాత లోకనాయకికి తీవ్రరక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు మాదేశ్. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లుగా డాక్టర్లు చెప్పడంతో బోరున విలపించాడు. అయితే మాదేశ్ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికి అసలు నిజం బయటపడింది. మృతురాలి తల్లిదండ్రులు తన అల్లుడికి మూర్ఖత్వమో, అమాయకత్వమో తెలియక తలలు బాదుకుంటున్నారు.