Homeట్రెండింగ్ న్యూస్Delhi Minor Girl Case: శ్రద్ధ వాల్కర్ ఘటనకు మించిన ఘోరం: పాపం ఆ బాలిక...

Delhi Minor Girl Case: శ్రద్ధ వాల్కర్ ఘటనకు మించిన ఘోరం: పాపం ఆ బాలిక ఎంత విలవిలలాడిపోయిందో?

Delhi Minor Girl Case: కసాయి లో నైనా ఇసుమంత దయార్ద్ర గుణం ఉంటుంది. విషాన్ని కక్కే పాములోనైనా ఎక్కడో ఒకచోట కించిత్ భయం ఉంటుంది. కానీ ఇతగాడిలో ఏ కోశానా పై రెండు లక్షణాలు లేవు. మనిషి పుట్టుక పుట్టిన తర్వాత కొద్దో గొప్పో మానవత్వాన్ని ప్రదర్శించే ఛాయలు అస్సలు లేవు. అసలు అతడిని మనిషి అనడం కూడా దండగ. రాక్షసులు కూడా తలదించుకునేలా అతడు చేసిన పని దేశం యావత్తూ చర్చనీయాంశమైంది. గతంలో ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాల్కర్ హత్యను మించిపోయేలా జరిగిన ఈ దారుణం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.

రాతి గుండె

ప్రేమించిన వారి కాలికి ముల్లు గుచ్చుకుంటేనే గుండె మెలిపట్టినట్టవుతుంది. అదే గుండె, వారు కన్నీరు పెడితే బాధతో బరువెక్కుతుంది. మరి.. అతడిదెంత రాతి గుండె అనుకోవాలి? పట్టరాని కోపంతో ప్రేమికురాలిని కత్తితో పొడిచాడు. తీవ్ర గాయమై రక్తం కారుతుండగా ఆ బాధను తట్టుకోలేక ఆమె బిగ్గరగా రోదిస్తున్నా కనికరమే లేకుండా పోటు మీద పోటు ఆపై మరో పోటు.. ఇలా ముప్పై నాలుగు సార్లు పొడిచాడు. ఇంతటి తీవ్రమైన దాడికి తట్టుకొని ఆమె ప్రాణమెలా నిలుస్తుంది? రక్తపు మడుగులో పడి ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలేసింది. అప్పటికీ కసి చల్లారక తిరిగి వెళుతున్న ఆ దుర్మార్గుడు వెనక్కి వచ్చి ఓ పెద్ద బండరాయి చేతుల్లోకి తీసుకొని మృతదేహమ్మీద విసురుగా పడేశాడు. మళ్లీ అదే బండరాయి తీసి.. మళ్లీ పడేసి.. అలా నాలుగైదుసార్లు వేసి.. అప్పటికే తూట్లు తూట్లు పడ్డ మృతదేహాన్ని మరింత ఛిద్రం చేశాడు. కాలితో పలుమార్లు ఆ మృతదేహాన్ని తన్నాడు. దేశరాజధాని ఢిల్లీలో వచ్చీపోయే జనంతో రద్దీగా ఉండే షాబాద్‌ డెయిరీ ప్రాంతంలోని ఓ వీధిలో ఆదివారం రాత్రి జరిగిందీ ఘోరం. హతురాలు 16 ఏళ్ల బాలిక. ఇంతటి ఉన్మాదానికి తెగించింది ఆమె ప్రియుడు, 20 ఏళ్ల సాహిల్‌ అనే యువకుడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన తాలూకు వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. హత్యకు కారణం ఏమై ఉంటుందనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. అయితే ఇద్దరి మధ్య గొడవే ఈ దారుణహత్యకు దారితీసిందని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఢిల్లీలో శ్రద్ధా వాల్కర్‌ అనే యువతిని ముక్కలు ముక్కలుగా నరికి.. ఆ అవశేషాలను ఫ్రిజ్‌లో దాచి.. కొన్నాళ్లకు వాటిని ఒక్కో చోట పడేసిన ఆమె ప్రియుడి దారుణాన్ని గుర్తు చేసేలా ఉన్న ఈ ఘోరం దేశ ప్రజలను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది.

గొడవను మనసులో పెట్టుకొని..

ఢిల్లీ పోలీసుల వివరాలు, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సాహిల్‌ ఫ్రిజ్‌, ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సాహిల్‌.. షాబాద్‌ డెయిరీ ప్రాంతం, జేజే కాలనీకి చెందిన సాక్షి అనే బాలిక ప్రేమించుకున్నారు. శనివారం ఇద్దరూ గొడవ పడ్డారు. దీన్ని మనసులో పెట్టుకున్న సాహిల్‌, సాక్షిని చంపాలని పథకం వేశాడు. బాలిక తన స్నేహితురాలి ఇంట్లో జరిగే వేడుక కోసం షాపింగ్‌ చేసేందుకు ఒంటరిగా బయలుదేరగా దారి కాచి అడ్డుకున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తితో సాక్షిని విచక్షణారహితంగా పొడిచి చంపాడు. మృతిచెందిందని నిర్ధారించుకొని వెళుతూ మళ్లీ వెనక్కి వచ్చి.. మృతదేహాన్ని కాలితో తన్నాడు. బండరాయిని తీసుకొని పలుమార్లు మృతదేహమ్మీద వేశాడు. ఇదంతా ఆ దారిన అటూ ఇటూ వెళుతున్న జనం, చూశారే గానీ అడ్డుకునే ప్రయత్నమే చేయలేదు. ఒకరిద్దరు ఆగి చూసినా.. వారిని సాహిల్‌ బెదిరించి అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. బాలికను చంపి.. నానా బీభత్సం సృష్టించిన అనంతరం సాహిల్‌ అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో వేట మొదలు పెట్టిన పోలీసులు సోమవారం అతడిని యూపీలోని బులంద్‌షహర్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. కీలక ఆధారాలు సేకరించి, నిందితుడికి అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూస్తామని స్పెసల్‌ పోలీస్‌ కమిషనర్‌ (లా అండ్‌ ఆర్డర్‌) దీపేంద్ర పాఠక్‌ పేర్కొన్నారు. ఈ భయానక ఘటనలో హతురాలి పుర్రె పగిలినట్లు పోస్టుమార్టంలో తేలింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి ఏమన్నారంటే..

కాగా ఈ దారుణ హత్యోదంతంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ ఢిల్లీలో ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. నేరగాళ్లు స్వైర విహారం చేస్తున్నారు. పోలీసులంటే వారికి భయం లేకుండాపోయింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గారూ.. శాంతిభద్రతలు మీ చేతుల్లో ఉన్నాయి. దయచేసి ఏదో ఒకటి చేయండి’’ అని ట్విటర్‌ వేదికగా కేజ్రీ వ్యాఖ్యానించారు. ఆ బాలిక చేసిన తప్పేమిటి? ఆమెను నడిరోడ్డు మీద హత్యచేశారు. చట్టం అన్నా, పోలీసులన్నా ఎవ్వరూ భయపడటం లేదు. ఏ చర్యా తీసుకోకపోతే గనక.. ఇలాంటి దారుణాలకు అంతే లేకుండా పోతుంది అని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్మన్‌ స్వాతి మాలివాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక హత్య.. ఇటీవల జరిగిన శ్రద్ధా వాల్కర్‌ హత్య కేసు హత్య కేసును తలపిస్తోందని.. ఇలాంటి ఘోరాలు ఇంకెన్ని చూడాలోనని బీజేపీ నేత కపిల్‌ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version