
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ వేగంగా అడుగులు వేస్తోంది. అక్రమాలను తవ్వుతూనే అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. ఇప్పటికే మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ నాయర్ వంటి వారిని కటకటాల పాలు చేసిన సీబీఐ.. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. దీంతో దేశ రాజకీయాల్లో మళ్లీ సంచలనం మొదలయింది. మొన్నటి దాకా మనిష్ సిసోడియాను టచ్ చేయరు అనుకున్న క్రమంలో అకస్మాత్తుగా సీబీఐ గేర్ మార్చింది. మనిష్ సిసోడియా అరెస్ట్ తర్వాత ఇప్పుడు వేళ్లు మొత్తం తెలంగాణ వైపు చూపిస్తున్నాయి.
ఎన్నికలుంటే ఏంటి?
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలో కవితను అరెస్ట్ చేయబోరని అప్పట్లో టాక్ వినిపించింది. కానీ వాటంన్నిటికీ భిన్నంగా సీబీఐ అడుగులు వేస్తోంది. సీబీఐ ఇప్పటి వరకూ అరెస్ట్ చేసిన వారంతా అప్రూవర్లుగా మారారు. ‘ సౌత్ గ్రూప్‌ను ఎవరెఎవరు ఏర్పాటు చేశారు? ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఎన్ని సార్లు కలిశారు? ఆ వంద కోట్ల ముడుపులు ఎక్కడివి? ఇందులో ఎవరి వాటా ఎంత? గత నిబంధనలను ఎందుకు ఎత్తేశారు’ అనే కోణాల్లో సీబీఐ ప్రశ్నలు అడగగా, అరెస్ట్ అయిన వారంతా పూసగుచ్చినట్టు సమాధానాలు చెప్పినట్టు సమాచారం. వారు చెప్పిన ఆధారాల ప్రకారమే సీబీఐ ఈ కేసులు మరింత లోతుగా వెళ్తోంది అని తెలుస్తోంది.
తెలంగాణ వైపు చూపు
ఇక ఈ కేసులో ఇప్పటి వరకూ సీబీఐ దాఖలు చేసిన ప్రతీ చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు ఉంది. కవిత సౌత్ గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించారని, సాక్ష్యాలను తారు మారు చేసేందుకు ఏకంగా 8 ఐ ఫోన్లను పగలగొట్టారని సీబీఐ తాను దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతే కాదు కవిత పలుమార్లు వ్యక్తిగత సహాయకులు లేకుండా ఢిల్లీ వెళ్లారని, ఇందులో ఎటువంటి అక్రమ కోణం లేకుంటే అలా ఎందుకు వెళ్లారని సీబీఐ తాను దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పేర్కొన్నది. అంతే కాదు అభిషేక్ నాయర్‌తో కవితకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, మాగుంట రాఘవతో పలు మార్లు సంభాషణలు కూడా జరిపిందని తెలుస్తోంది. ఇక మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వేళ్లన్నీ తెలంగాణ వైపే చూపిస్తున్నాయి.

మనిష్ సిసోడియాతో మొదలు
ఇక ఇప్పటి దాకా సీబీఐ అరెస్ట్ చేసిన వారంతా రాజకీయంగా ప్రభావితం చేయని వాళ్లే. ఈ స్కాంలో మొదట రెండో శ్రేణికి చెందిన నాయకులను అరెస్ట్ చేసిన సీబీఐ చాలా చాకచక్యంగా అనుబధ చార్జ్ షీట్లు దాఖలు చేసుకుంటూ వస్తోంది. పైగా నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారు మారు చేస్తారని కోర్టుకు విన్నవిస్తోంది. సీబీఐ తరఫున లాయర్ల వాదనతో ఏకిభవిస్తున్న కోర్టు బెయిల్ ఇవ్వడం లేదు. ఇక మనిష్ సిసోడియా అరెస్ట్‌తో ఎంత పెద్దవారయినా చట్టం ముందు అందరూ సమానమనే సంకేతాన్ని సీబీఐ ఇస్తోంది. కాగా ఇటీవల ఎమ్మెల్సీ కవిత మహారాష్ట్ర వెళ్లారు. అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులర్పించారు. అంతే కాదు మోదీ ప్రజాస్వామ్నాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. అంటే తనను కూడా అరెస్ట్ చేస్తారని కవితకు తెలిసిపోయిందా?