
WTC Final 2023- Team India: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు విషయంలో సంచలనమేమీ జరగలేదు.. శ్రీలంక అద్భుతమేదీ చేయలేదు.. అంతా అనుకున్నట్లే జరిగింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టింది. న్యూజిలాండ్ చే తిలో తొలి టెస్టులో ఓడిన శ్రీలంక.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో ఆస్ట్రేలియాతో చివరిదైన నాలుగో టెస్టులో గెలుపోటములతో సంబంధం లేకుండా టీమిండియా ఫైనల్ బెర్తు దక్కించుకుంది. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు లో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
రెండు టెస్టుల విజయంతో అవకాశాలు మెరుగు..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు గెలిచిన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. కానీ మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ ఒక్క గెలుపుతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఆసీస్ దూసుకెళ్లగా.. మన జట్టు ఫైనల్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. మన జట్టు నేరుగా ఫైనల్ కు చేరాలంటే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తప్పక నెగ్గాలి. ఒకవేళ నాలుగో టెస్టులో టీమిండియా ఓడినా, లేక డ్రా చేసుకున్నా.. శ్రీలంక, కివీస్ టెస్టు సిరీస్ పై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ అయినా శ్రీలంక ఓడిపోవాలి. ఇప్పుడు అదే జరిగింది.

డ్రా దిశగా నాలుగో టెస్టు..
ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఫలితం తేలే అవకాశాలు కనిపించడం లేదు. ఐదో రోజు ఆట కొనసాగుతోంది. డ్రా అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ఓడిపోవడంతో మనకు లైన్ క్లియర్ అయింది. శ్రీలంక నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని న్యూజిల్యాండ్ 8 ఎనిమిది వికెట్లు కోల్పోయిఛేదించింది.
శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన కేన్ విలియమ్సన్..
డబ్ల్యూటీసీ 2021–23 ఫైనల్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్ నీళ్లు చల్లాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన సూపర్ సెంచరీ సాధించిన కేన్(121), తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం 68.52 శాతంతో ఆసీస్ ఉండగా.. భారత్ 60.29 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా భారత్–ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.