Pankaj Tripathi: ఇంట్లో నుంచి బయటకు వెళ్లినవారు.. క్షేమంగా తిరిగి వస్తారనే గ్యారెంటీ లేని రోజులవి. పైగా ఏ ప్రమాదం ఎటువైపు నుంచి దూసుకొస్తుందో తెలియదు.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో.. సరిగ్గా ఇలాంటి దుస్థితే ఆ సినీ నటుడికి ఎదురైంది. రోడ్డు ప్రమాదంలో అతని బావ దుర్మరణం చెందగా, సోదరీమణి తీవ్రంగా గాయపడింది. చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు ఓ సోదరి సబితా తివారి ఉన్నారు. సబిత తివారి రాకేష్ తివారి ని కొన్ని సంవత్సరాల క్రితం వివాహమాడారు. వారికి పిల్లలు కూడా ఉన్నారు. శనివారం వారు వ్యక్తిగత పని మీద కారులో బీహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ జిల్లా నుంచి పశ్చిమబెంగాల్ బయలుదేరారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాకేష్ తివారి, సబితా తివారి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల గుర్తించి వెంటనే వారిని ధన్ బాద్ ప్రాంతంలోని షాహిద్ నిర్మల్ మొహరో మెడికల్ కాలేజ్ కి తరలించారు. అక్కడ క్షతగాత్రులకు వైద్యులు చికిత్స చేశారు. చికిత్స పొందుతూ రాకేష్ చనిపోయాడు. పంకజ్ త్రిపాఠి సోదరి సబిత తివారి తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
వాస్తవానికి ఆ వాహనాన్ని రాకేష్ తివారి నడుపుతున్నారు. ధన్ బాద్ సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో రాకేష్, సబిత తీవ్రంగా గాయపడ్డారు. రక్తస్రావం అధికంగా కావడంతో రాకేష్ అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ తివారి కన్నుమూశాడు.
బావ మృతి చెందడం, అక్క తీవ్రంగా గాయపడటంతో పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం నెలకొంది. గత ఏడాది ఆగస్టులో పంకజ్ త్రిపాఠి తండ్రి పండిట్ బనారస్ తివారి కన్నుమూశారు. పంకజ్ త్రిపాఠి ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన మర్డర్ ముబారక్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించాడు. అంతకుముందు మెయిన్ అటల్ హూ, ఓ మై గాడ్ -2, స్త్రీ, లూడో, మిమి, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, బరేలికి బర్ఫీ, గ్యాంగ్స్ ఆఫ్ వసిపూర్ వంటి చిత్రాలలో కీలకపాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఓటీటీ లో సూపర్ హిట్ అయిన సేక్రేడ్ గేమ్స్, మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్ వంటి వెబ్ సిరీస్ లలో కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్, నిశాంత్ కౌశిక్ నిర్మించిన కాగజ్ అనే సినిమాలో కూడా పంకజ్ త్రిపాఠి నటించి మెప్పించారు.