https://oktelugu.com/

DC Vs SRH: హైదరాబాద్ అదృష్టం కొద్దీ ఔట్ అయ్యాడు.. లేకుంటే జేక్ ఫ్రేజర్ కొంప ముంచేవాడు

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున వేగవంతంగా అర్థ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఈ సీజన్లో తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన ఆటగాడిగా ఘనత లిఖించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 21, 2024 / 08:21 AM IST

    DC Vs SRH

    Follow us on

    DC Vs SRH: ఇద్దరూ ఆస్ట్రేలియన్లే.. ఒకరేమో హైదరాబాద్ కు.. మరొకరేమో ఢిల్లీకి ఆడుతున్నారు. అందులో హైదరాబాద్ ఆటగాడు హెడ్ విధ్వంసం సృష్టిస్తే.. ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మైదానంలో చిన్నపాటి ప్రళయాన్ని సృష్టించాడు.. బౌలర్ ఎవరనేది కాదు. బంతులు ఎంత వేగంతో విసిరాడనేది కాదు.. గట్టిగా కొడితే ఫోర్ వెళ్తోంది. కసికొద్ది బాదితే బౌండరీ అవతల పడుతోంది. అలా జేక్ ఫ్రేజర్ ఇన్నింగ్స్ కొనసాగుతుంటే హైదరాబాద్ బౌలర్లు మౌన ప్రేక్షకులుగానే మిగిలిపోయారు. బాల్ బాయ్స్ బంతులు అందివ్వడం.. బౌలర్లు బంతులు వేయడం..జేక్ ఫ్రేజర్ కొట్టడం.. ఇలా సాగిపోయింది తంతు. ముఖ్యంగా హైదరాబాద్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్లో జేక్ ఫ్రేజర్ శివతాండవం చేశాడు. అ ఓవర్లో 4, 4, 6, 4, 6, 6 కొట్టి, తన బ్యాటింగ్ స్టామినా ను హైదరాబాద్ బౌలర్లకు పరిచయం చేశాడు. హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ లోనూ దూకుడుగా ఆడాడు.. ముఖ్యంగా మాయాంక్ మర్కండే వేసిన ఏడో ఓవర్లో భారీ సిక్స్ కొట్టి, కేవలం 15 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు.

    ఈ అర్థ సెంచరీ తో జేక్ ఫ్రేజర్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున వేగవంతంగా అర్థ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఈ సీజన్లో తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన ఆటగాడిగా ఘనత లిఖించాడు. వేగంగా ఆడే క్రమంలో మయాంక్ మార్కండే బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అతడు అవుట్ అయిన తర్వాత హైదరాబాద్ జట్టు ఊపిరి పీల్చుకుంది. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. 25 పరుగులకే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టును జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరల్ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 30 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జేక్ ఫ్రేజర్ కేవలం 18 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ పోరల్ 22 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్ నెలకొల్పిన భాగస్వామ్యమే ఢిల్లీ జట్టు తరఫున అత్యుత్తమంగా నిలిచింది. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో ఢిల్లీ చేతులెత్తేసింది.

    వాస్తవానికి ఈ మైదానం బౌలర్లకు అనుకూలిస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా మైదానం బ్యాటింగ్ వైపు టర్న్ అయింది. బంతి బౌన్స్ కాకపోవడం.. బ్యాట్ మీదకి రావడంతో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆటగాడు హెడ్ 32 బంతుల్లో 89 పరుగులు ముఖ్యంగా హైదరాబాద్ ఆటగాడు 32 బంతుల్లో 89, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46, షాబాజ్ అహ్మద్ 29 బంతుల్లో 59* పరుగులు చేయడం వెనుక కారణం అదే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.. ఈ స్థాయిలో బ్యాటర్ల విధ్వంసం ఉంటే, బౌలర్లు బౌలింగ్ చేయడం కష్టమైపోతుందని వారు వివరించారు. కాగా, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జేక్ ఫ్రేజర్ 4, 4, 6, 4, 6, 6 కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఒక్క ఓవర్ లోనే జేక్ ఫ్రేజర్ 30 పరుగులు పిండుకోవడం విశేషం.