Bihar : సాధారణంగా విద్యుత్ శాఖ అధికారులు కోతలు విధిస్తారు. ఇటువంటివి వేసవిలో ఎక్కువగా కనిపిస్తాయి. అవసరానికి మించి విద్యుత్ పంపిణీ జరగకపోతే అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలను విసిగిస్తారు. అయితే బిహార్ లోని ఓ గ్రామానికి మాత్రం ప్రతీరోజూ రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అలాగని చుట్టు పక్కల గ్రామాలకు సరఫరా ఉంటుంది. సరిగ్గా ప్రతిరోజు ఒకే సమయానికి నిలిచిపోతుంటుంది. దీంతో ప్రజలు అంధకారంతో పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. విద్యుత్ శాఖ సిబ్బందికి ఫిర్యాదుచేసినా ఎక్కడా ఏ సమస్య లేదన్నట్టు చెప్పేవారు.
ఇలా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వేళ ఇళ్లలో ఉండే వస్తువులు చోరీకి గురయ్యాయి. పిల్లల చదువుకు సైతం ఆటకంగా మారుతోంది. గ్రామానికి ఇదో సామాజిక సమస్యగా మారిపోయింది. ప్రతిరోజూ ఒకే సమయానికి సరఫరా నిలిచిపోతుండడం మిస్టరీగా మారింది. దీంతో గ్రామస్థులు ఇష్యూపై సీరియస్ గా దృష్టిసారించారు. అయితే ఓ యువతి నిర్వాకంతోనే విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని తెలిసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇన్నాళ్ల సమస్యకు ప్రేమికులే కారణమని తెలిసి ఆగ్రహంతో గ్రామస్థులు వారిని దేహశుద్ధి చేశారు.
గ్రామానికి చెందిన యువతి మరో యువకుడ్ని ప్రేమిస్తోంది. ఇద్దరు రాత్రిపూట ఏకాంతంగా కలవాలని డిసైడయ్యారు. అందుకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తేనే సాధ్యమని భావించారు. దీంతో సదరు యువతి ప్రతిరోజూ ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసేది. సరస సల్లాపాలు చేసుకున్న తరువాత సరఫరాను పునరుద్ధరించేది. నెలల తరబడి జరుగుతున్నతతంగాన్ని గ్రామస్థులు బయటపెట్టారు. ఆ ప్రేమికులిద్దర్ని వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ‘కరెంట్’ కథ సుఖాంతమైంది.