Cow urine baths in Sudan : కాలం మారుతోంది. కట్టుబాట్లు మారుతున్నాయి. సమాజం ఆటవికత నుంచి నాగరికత వైపు అడుగులేసింది. ఆకాశమే హద్దుగా ప్రపంచం నూతన సాంకేతికత వైపు దూసుకెళ్తోంది. అయినా ఇప్పటికీ కొన్ని సమూహాలు ఆటవికత నుంచి బయటకు రావడంలేదు. కాలం చెల్లిన పద్ధతుల్ని ఇప్పటికీ పాటిస్తున్నాయి. వారిని చూస్తే వెర్రితనమా.. తెలియనితనమా ? అన్న సందేహం కలగకమానదు.
గోమూత్రం ఇండియాలోని హిందువులకు పవిత్రమైనది. ఇళ్లల్లోనూ, తలపైన గోమూత్రం చల్లుతుంటారు. కొందరు మరొకడుగు ముందుకేసి గోమూత్రం తాగుతారు. గోమూత్ర సేవనం పరమ పవిత్రమైనదని భావిస్తారు. వీరిని చూసి చాలా మంది ఇంత పిచ్చితనమా అంటూ పెదవి విరుస్తారు. ఇంతటి సాంకేతిక యుగంలో కూడా వీరి వెర్రి పనులేంటి అని ఎద్దేవా చేస్తారు. ఇలాంటి పద్ధతులు ఈ మధ్య కాలంలోనే ఇండియాలో అక్కడక్కడ దర్శనమిస్తాయి.
ఇండియాలో హిందువులు పాటించే సంప్రదాయాన్ని మరో దేశంలోని ఒక తెగ ప్రజలు కూడా పాటిస్తున్నారు. వారికి గోమూత్రం హిందువుల కంటే పవిత్రమైనది. దక్షిణ సూడాన్ లోని `ముందరి` తెగవాసులకు గోమూత్రం అంటే పరమ పవిత్రమైనది. గోమూత్రాన్ని వారు బంగారంగా భావిస్తారట. ఆవులు ఎప్పుడు మూత్రాన్ని పోస్తాయా అని కాచుకుని కూర్చుంటారట. ఆవులు మూత్రం పోయగానే దాని కింద తల పెట్టి స్నానం చేస్తారట. ఇంతటి మూర్ఖత్వానికి కారణం జుట్టు రంగు మారుతుందనే నమ్మకం. గోమూత్రంతో స్నానం చేస్తే వారి జుట్టు రాగి రంగులోకి మారుతుందట.
రాగి రంగు జుట్టు ఉన్న పురషుల్నే ముందరి తెగ ప్రజలు ఇష్టపడతారట. లేదంటే పెళ్లికాని ప్రసాద్ లా జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతారంట. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉండటం కంటే గోమూత్రం స్నానం చేయడమే మంచిదని ఇక్కడి మగవారు భావిస్తున్నారట. ఏం చేస్తాం మరి.. ఒంటరితనం అలాంటిది. జంట లేకుంటే రాత్రికి నిద్ర పట్టదు. ఇక ఏం చేయలేక పెళ్లి కోసం గోమూత్ర స్నానం చేయాల్సిందే. ముందరి తెగవాసులు గోమూత్ర స్నానం చేయడానికి మరొక కారణం కూడా ఉంది. దక్షిణ సూడాన్ లో ముందరి తెగకు నీటి కొరత ఉంటుంది. నీటితో స్నానం చేయాలంటే చాలా ఇబ్బంది. సుదూర ప్రాంతాలకు తరలివెళ్లాలి. అంత దూరం వెళ్లలేక అక్కడే దొరికే గోమూత్రంతో స్నానం చేస్తారని మరొక కథనం చెబుతారు.
దక్షిణ సూడాన్ లోని ముందరి తెగ ప్రజలు నివసించే ప్రాంతం పర్యాటక ప్రాంతమేమీ కాదు. ఇక్కడికి పర్యాటకులెవరూ రారు. కానీ ముందరి తెగ జీవన విధానం చూసి ఇటీవల పర్యాటకులు పెరుగుతున్నారట. వారు జుట్టు రంగు కోసం గోమూత్ర స్నానం చేయడం పర్యాటకుల్ని ఆకర్షిస్తోందట. పర్యాటకులు పెరిగితే ముందరి తెగవాసుల జీవన విధానమే వారికి జీవనోపాధి కానుంది.