
YS Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ, వైఎస్. భాస్కర్‌రెడ్డి తనయుడు వైఎస్. అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఇప్పటికే నాలుగుసార్లు విచారణ చేసిన సీబీఐ మరోమారు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు విచారణ తర్వాతనే సీబీఐ విచారణకు వెళ్తానని ప్రకటించారు. దీంతో అవినాష్‌రెడ్డిలో కూడా అరెస్ట్ భయం మొదలైనట్లు తెలుస్తోంది.
ముందస్తు బెయిల్ కోసం..
మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి సోమవారం సీబీఐ ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఈమేరకు ఆదివారం సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు వెళ్లకుండా అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అవినాష్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందని అవినాశ్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు. ఎంపీ అభ్యర్థనపై మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు విచారణ జరపనుంది.

బెయిలా.. జైలా..
వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా చేర్చి విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ నోటీసుల నేపథ్యంలో పులివెందుల నుంచి హైదరాబాద్‌కు ఆయన బయల్దేరారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వైఎస్.భాస్కర్‌రెడ్డి, అవినాష్ అనుచరుడు ఉదయ్ కుమార్‌రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు అవినాష్‌రెడ్డికి బెయిల్ ఇస్తుందా లేక విచారణకు వెళ్లాలని సూచిస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. విచారణకు వెళితే మాత్రం అరెస్టు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఈ భయంలోనే అవినాష్‌రెడ్డి కోర్టు తలపు తట్టినట్లు ప్రచారం జరుగుతోంది. తన పిటిషన్‌లో సీబీఐ అధికారులు, టీడీపీ కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయని కూడా ఆరోపించారు. మరి అవినాష్‌రెడ్డి జైలుకు వెళ్తారా.. ముందస్తు బెయిల్‌తో ఊరట చెందుతారా అనేది తెలియాలంటే మధ్యాహ్నం వరకు వేచిచూడాలి.