
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ పై శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు సీటిల్ నుంచి చేపల బోటులో ప్రయాణం చేసిన ముగ్గురికి కరోనా ఎందుకు సోకట్లేదని పరిశోధనలు చేయగా కొత్త విషయం తెలిసింది.
వాళ్లకు అప్పటికే కరోనా సోకి కోలుకున్నారని… కరోనా సోకినా వాళ్లకు ఆ విషయం తెలియలేదని… ఒకసారి కరోనా సోకిన వారికి మరోసారి వైరస్ సోకట్లేదని తేల్చారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో భారీ స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని… అందువల్లే వాళ్లు కరోనా బారిన పడట్లేదని శాస్త్రవేత్తలు తేల్చారు. సీటీల్ నుంచి 122 మంది వెళ్లిన బోటులో 104 మందికి ఒక వ్యక్తి నుంచి కరోనా సోకింది.
యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, మెడికల్ క్లినికల్ వైరాలజీ లాబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గ్రెనింజర్ కరోనా నుంచి కోలుకున్న వారికి వైరస్ సోకుతుందా…? లేదా…? అనే విషయాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని తెలిపారు. బోటులో 18 మందికి కరోనా సోకలేదని…. వారిలో 15 మంది ఎవరితో సన్నిహితంగా మెలగలేదని శాస్త్రవేత్తలు చెప్పారు. ముగ్గురికి మాత్రం అప్పటికే కరోనా సోకి తగ్గడంతో వైరస్ నిర్ధారణ కాలేదని… దీంతో కరోనా సోకిన వాళ్లకు మళ్లీ వైరస్ సోకే అవకాశాలు లేవని తెలుస్తోందని అభిప్రాయపడ్డారు.