Cine Industry : ఈ ఏడాది చిత్ర పరిశ్రమలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసే కిచ్చా సుదీప్ హిందీ జాతీయ భాష కాదని చెప్పడం వివాదాస్పదం అయ్యింది. ఈ విషయంలో నటుడు అజయ్ దేవ్ గణ్-సుదీప్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్యూర్ సోల్ గా పేరున్న సాయి పల్లవి అనుకోకుండా మతపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీలో పండిట్స్ పై జరిగిన హింసను చూపించారు. హిందువులే కాదు, మైనారిటీలుగా ఉన్న ముస్లింలు కూడా గోరక్షణ పేరుతో హింసకు గురవుతారని సాయి పల్లవి చెప్పడాన్ని బీజేపీ వర్గాలు తప్పుబట్టాయి.
కాంతార ఈ దశాబ్దపు అద్భుతంగా పేరు తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ చిత్రాన్ని కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. దళితుల ప్రాతినిధ్యాన్ని ఈ చిత్రం ప్రశ్నించేదిగా ఉంది. స్త్రీ ద్వేషపూరిత సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. అలాగే వరాహ రూపం సాంగ్ కాపీ ఆరోపణలు ఎదుర్కొంది. నయనతార దంపతులు సరోగసి పద్దతిలో పేరెంట్స్ అయ్యారు. పెళ్ళైన నెలల వ్యవధిలో తల్లిదండ్రులమయ్యామని ప్రకటించడంతో సరోగసి నిబంధన ఉల్లఘించారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్నారు.
కాంతార చిత్రం చూడలేదని రష్మిక మందాన చెప్పడం వివాదాస్పదమైంది. సొంత పరిశ్రమ నిర్మించిన ఒక గొప్ప చిత్రాన్ని రష్మిక అవమానించారని కన్నడ పరిశ్రమ వర్గాలు రష్మికపై ఆరోపణలు చేశాయి. ఒక దశలో ఆమెను బ్యాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రష్మిక అనంతరం వివరణ ఇచ్చారు. లైగర్ మూవీ నిర్మాణం, బిజినెస్ వ్యవహారాల్లో ఆర్థిక నేరాలు జరిగాయన్న సమాచారంతో ఈడీ అధికారులు దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, హీరో విజయ్ దేవరకొండను విచారించారు. పూరి-ఛార్మి మనీ లాండరింగ్ కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
కన్నడ స్టార్ హీరో దర్శన్ అదృష్ట దేవతను బెడ్ రూమ్ లోకి లాక్కెళ్లి వివస్త్రను చేయాలి, లేదంటే మనల్ని వదిలి వెళ్ళిపోతుందని చెప్పడం వివాదాస్పదమైంది. పెద్ద ఎత్తున హిందూ వర్గాలు ఆయన మాటలు ఖండించాయి. ఓ వ్యక్తి దర్శన్ పై చెప్పు విసరడం చర్చకు దారి తీసింది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి యువ దర్శకుడిని కించపరిచేలా మాట్లాడారు. మమ్ముట్టి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మమ్ముట్టి క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇక టాలీవుడ్ లో గత రెండు నెలలుగా సంక్రాంతి చిత్రాల వివాదం నడుస్తుంది. డబ్బింగ్ మూవీ వారసుడు సంక్రాంతికి విడుదల చేయడానికి వీల్లేదని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్న వారసుడు చిత్ర విడుదల ఆపడం కోలీవుడ్ వర్గాల్లో ఆగ్రహం రగిలించింది. వారు తెలుగు చిత్రాలు ఆపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు థియేటర్స్ దక్కకుండా కుట్రపన్నుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉంది.