Transgender Love: ప్రేమ గుడ్డిదంటారు. కొన్ని కొన్ని ఘటనలు, కొన్ని జంటలను చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రేమ పేరుతో స్వలింగ సంపర్కం కూడా పెరుగుతోంది. ఇలాంటి ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో వెలుగులోకి వచ్చింది. ఈ వెరైటీ ప్రేమకథలో ట్విస్ట్ ఏమిటంటే ఇద్దరు యువకులు కాలేజీలో చదువుకుంటూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసే కొంతకాలం జీవించారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అందుకు తగినట్లుగా బీఈడీ చదివిన నాగేశ్వరరావు తన ప్రియుడు పవన్ పేరును భ్రమరాంభగా మార్చాడు. ఢిల్లీ తీసుకెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించాడు. తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరకు మోసం చేశాడు. ప్రియుడు చెప్పిందల్లా చేసిన భ్రమరాంభ అలియాస్ పవన్ ఇప్పుడు మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించింది. టిపికల్ లవ్ స్టోరీని ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
ఇదీ యువకుల ప్రేమకథ..
లవ్ చీటింగ్ కేసులు ఇప్పటి వరకు ఎన్నో చూశాం. మరెన్నో విన్నాం. కానీ విజయవాడలో ప్రేమ పేరుతో చేసిన మోసం కొత్తగా ఉంది. విజయవాడకు చెందిన నాగేశ్వరరావు, పవన్ అనే ఇద్దరు యువకులు బీఈడీ చదివారు. చదువుకునే రోజుల్లో కలిసి ఉన్న పవన్, నాగేశ్వరరావు ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి ఒకే రూమ్‌లో ఉండటంతో పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి సంగతి తర్వాత ముందు లింగమార్పిడి చేయించుకోమని పవన్‌కు సలహా ఇచ్చిన నాగేశ్వరరావు ఢిల్లీ తీసుకెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించి భ్రమరాంభగా మార్చాడు.
లింగమార్పిడితో ఆటంకం ఉండదని..
ఇద్దరు యువకుల పెళ్లి అంటే సమాజం ఒప్పుకోదని, ఇద్దరి కుటుంబాల్లోనూ ఒప్పుకోరని భావించారు. ఆటంకం తొలగిపోవాలంటే లింగమార్పిడి ఒక్కటే మార్గమని అనుకున్నారు. ఈమేరకు ఢిల్లీలో లింగమార్పిడి చేయించారు. అయితే ఢిల్లీ నుంచి రాగానే నాగేశ్వరరావు భ్రమరాంభగా మారిన పవన్‌తో పెళ్లికి నిరాకరించాడు. ఆమెగా మారిన అతనికి దూరంగా ఉంటూ వచ్చాడు. చివరకు పెళ్లి లేదు గిల్లీ లేదు అనడంతో బాధితురాలు ప్రియుడు ఇచ్చిన జలక్‌తో షాక్‌తింది. ప్రియుడు చేసిన మోసం నుంచి తేరుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ప్రియుడు నాగేశ్వరరావుపై ఫిర్యాదు చేసింది.
తలలు పట్టుకుంటున్న పోలీసులు..
ఇద్దరు యువకులు ప్రేమించుకోవడం ఏమిటి..పెళ్లి చేసుకునేందుకు లింగమార్పిడి చేయించడం ఏమిటి..? తీరా పెళ్లి చేసుకోమనే సరికి మోసం చేయడం ఏమిటని పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఈకేసును ఎలా పరిష్కరించాలి..? బాధితురాలికి న్యాయం ఎలా చేయాలో ..ప్రియుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక తల పట్టుకుంటున్నారు పోలీసులు.