Jangaon: బ్రాయిలర్ చికెన్ వెల్లువెత్తుతున్న ఈ కాలంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది నాటు కోళ్లను పెంచుతుంటారు. కొందరు విందుల సమయంలో వాటిని ఆరగిస్తే.. మరికొందరేమో కుటుంబ పోషణకు అమ్మేస్తుంటారు. నాటు కోళ్లను గ్రామీణ ప్రాంత మహిళలు అత్యంత ఇష్టంగా పెంచుకుంటారు. కోడి గుడ్లను పెట్టిన నాటి నుంచి మొదలు పెడితే పొదిగి పిల్లలుగా ఎదిగేంతవరకు కంటికి రెప్పలా చూసుకుంటారు. వాటికి ధాన్యం గింజలు, బియ్యం, దాణా పోస్తూ పోషిస్తుంటారు. కొందరైతే ఇంటి ఖర్చులను నాటు కోళ్ల పెంపకం తోనే వెల్లదీస్తుంటారు. పొరపాటున ఆ నాటు కోళ్లకు ఎవరైనా హాని తల పెడితే ఏమాత్రం సహించరు. గొడవ పెట్టుకోవడానికి కూడా వెనుకాడరు. ఇక పిల్లలు, పాములు, గద్దల నుంచి నాటుకోళ్లను మహిళలు అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటారు. కొందరైతే ప్రత్యేకంగా స్టాండ్లు తయారుచేసి అందులోనే పెంచుతుంటారు.
కలెక్టరేట్లో మహిళ ఫిర్యాదు
జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన శ్రీవాణి గాయత్రి నాటుకోళ్లను పెంచుకుంటున్నది. ఈమె పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారు. శ్రీవాణి గాయత్రి అత్తగారు కూడా గతంలో నాటుకోళ్లను పెంచేవాళ్ళు. వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి కావడంతో గాయత్రి కూడా నాటు కోళ్లను అదే విధంగా పెంచుకుంటున్నది. అయితే శ్రీవాణి గాయత్రి పొరుగున ఉన్న వారి ఇంటికి మేత కోసం కోళ్లు వెళ్లడం ప్రారంభించాయి. అయితే అవి మేత మేయడం తో పాటు వాళ్ళ ఇంట్లో పెంట వేస్తున్నాయి. ఈ విషయాన్ని శ్రీ వాణి గాయత్రి కి మొదట్లో పక్కింటి వారు చెప్పారు. ఆమె కొద్ది రోజులపాటు కోళ్లను అటువైపుగా వెళ్లకుండా చూసుకుంది. అయితే ఇటీవల కోళ్లు మళ్లీ వెళ్లాయి. దీంతో పక్కింటి వాళ్ళు హెచ్చరించారు. ఇంకోసారి మా ఇంటి వైపు కోళ్లు వస్తే బాగోదని స్పష్టం చేశారు. అయితే కొద్ది రోజులపాటు మళ్లీ కోళ్లను వెళ్లకుండా గాయత్రి చూసుకుంది. ఇటీవల కోళ్లు మళ్లీ వెళ్లడంతో పంచాయతీ మొదలైంది.. శ్రీవాణి గాయత్రి ఈసారి జాగ్రత్త పడినా ఉపయోగం లేకుండా పోయింది. మేత కోసం కోళ్లు వెళ్లడంతో పక్కింటి వారు మందు పెట్టి చంపారని శ్రీవాణి గాయత్రి ఆరోపిస్తోంది. అంతేకాదు తన కోళ్లను సంచిలో వేసుకొని పక్కింటి వారి మీద ఫిర్యాదు చేయడానికి ఏకంగా జనగామ కలెక్టరేట్లోకి వెళ్ళింది. కలెక్టరేట్ లోని ఉన్నతాధికారికి తన ఆవేదన వెల్లడించింది. ” నేను కోళ్లు పెంచుకుంటున్న సార్. పక్కింటోళ్లు మందులు పెట్టి చంపిన్రు.. నాకు కోళ్ల మీద వచ్చే ఆదాయమే ప్రధాన మార్గం.. అలాంటి కోళ్లను కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ఎట్లా బతకాలి సర్.. నాకు మీరే న్యాయం చేయాలి” అంటూ శ్రీవాణి గాయత్రి తన గోడును వెల్లబోసుకుంది. మరి దీనిపై జనగామ కలెక్టరేట్ అధికారులు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
తను పెంచుకుంటున్న కోళ్లను.. పక్కింటివారు మందులు పెట్టి చంపారని.. శ్రీవాణి గాయత్రి అనే మహిళ జనగామ కలెక్టరేట్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. గాయత్రీ ది లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామం. చనిపోయిన కోళ్లను కలెక్టరేట్ కు శ్రీవాణి గాయత్రి తీసుకొచ్చారు.#Telangana #Janagama pic.twitter.com/8LIy3hqqMr
— Anabothula Bhaskar (@AnabothulaB) January 11, 2025