
Raghu Karumanchi: రఘు కారుమంచి తెలుగు హాస్య ప్రియులకు సుపరిచితమైన పేరు. ఆది మూవీ ఆయనకు బీభత్సమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ ‘అన్న నువ్వు ముఖానికి ఏదో రాస్తావంటా, ఏంటదీ?’ ని అడగ్గానే… ‘ఫెయిర్ అండ్ లవ్లీ, పొద్దున రాశా ఎండిపోయింది’ అని రఘు చెప్పిన డైలాగ్ అప్పట్లో పిచ్చ ఫేమస్. వివి వినాయక్, ఎన్టీఆర్ తమ చిత్రాల్లో రఘుకు క్యారెక్టర్స్ ఇచ్చి ప్రోత్సహించారు. దాదాపు 150 చిత్రాల్లో రఘు నటించారు. 2013లో జబర్దస్త్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి రఘు కెరీర్ కొంచెం నెమ్మదించింది.
రోలర్ రఘు పేరుతో టీమ్ ని ఏర్పాటు చేసి జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ చేశాడు. అయితే ఎక్కువ కాలం అక్కడ ఉండలేదు. మన వల్ల కాదని బయటకు వచ్చేశాడు. ఇక లాక్ డౌన్ లో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు తెలిసింది. అలాంటి రఘు ఒక్కసారిగా అందరి మైండ్స్ బ్లాక్ చేశాడు. రఘు పెద్ద లగ్జరీ హౌస్లో ప్రత్యక్షమయ్యాడు. హోమ్ టూర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ లో రఘు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. కోట్ల రూపాయల విలువ చేసే రఘు ఇల్లు అందరినీ ఆకర్షించింది.
ఆధునిక హంగులు ఆర్భాటాలతో, విశాలంగా ఉన్న ఆ ఇంటిని రఘు ఇటీవల నిర్మించినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులు పడ్డ రఘు ఓవర్ నైట్ కోటీశ్వరుడు ఎలా అయ్యారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య రఘు సినిమాలు వదిలేసి వ్యాపారం చేసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణాలో రెండు వైన్ షాప్స్ లైసెన్సు దక్కించుకున్న రఘు… ఆ వ్యాపారం చేస్తున్నట్లు వెల్లడించారు. వైన్ షాప్ లో మందు అమ్ముతున్న రఘు వీడియో వైరల్ గా మారింది.

మరి వైన్ షాప్స్ మీద వచ్చే ఆదాయంలో ఈ రెండేళ్లలో ఇంత ఘనంగా సంపాదించాడా? లేక మరో మతలబు ఏదైనా ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆయన అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీ ఇల్లు అద్భుతంగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. 2002లో విడుదలైన ఆది చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన రఘు… దిల్, యోగి, కిక్, అదుర్స్, బృందావనం, నాయక్, మిర్చి వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఇటీవల జాంబీ రెడ్డి, హీరో చిత్రాల్లో ఆయన నటించారు.