
CM Jagan- Minister Seediri Appalaraju: తమ శాఖల పనితీరు, ప్రగతి తప్పించి ఏపీ మంత్రులు ఏ అంశమైనా మాట్లాడగలరు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిగలరు. అవసరమైతే బూతులు కూడా మాట్లాడగలరు. హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే వెనుకా ముందు చూడరు కూడా. ఎంత పెద్దగా మాట్లాడితే పెద్దలకు అంత ఇష్టులుగా మారుతుండడంతో నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు.తాము రాజకీయ నేతలమనే సంగతిని మర్చిపోతారు. ఎక్కడ ప్రభుత్వ పెద్దల్ని సంతృృప్తి పరచకపోతే తమ పదవి ఊడిపోతోందో లేకపోతే కొత్తగా రాదో అని మథనపడతారు. బూతుల రేసు పెట్టుకుంటారు. దీన్ని హైకమాండ్ ఆనందిస్తుంది. అయితే ఇటీవల అటువంటి మాటలు వికటిస్తున్నాయి. మంత్రులు చేస్తున్న వ్యవహారాలకు పార్టీ మూల్యం చెల్లించుకుంటుండడంతో హైకమాండ్ కొందర్ని నియంత్రిస్తోంది. తాజాగా మంత్రి అప్పలరాజును సీఎం జగన్ చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది.
అలా లీకు ఇచ్చారా?
అయితే ఇది మీడియా లీకుగానే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గట్టిగా మాట్లాడే వారికే జగన్ అమాత్య పదవులిచ్చారు. ఆ కోటాలోనే అప్పలరాజు పదవి తెచ్చుకున్నారు. న్యాయ వ్యవస్థపై అప్పలరాజు మాట్లాడేసరికి శ్రీకాకుళం జిల్లాలో హేమాహేమీలు ఉన్నా..పిలిచి మరీ పదవిని కట్టబెట్టారు. పునర్విభజన సమయంలో సైతం అప్పలరాజును కొనసాగించి తన అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు అప్పలరాజు తొలగింపు జాబితాలో ఉన్నారు. దీంతో మరోసారి తన మాటల డోసును పెంచి జగన్ కు ఫిదా చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జగన్ కు ఇష్టుడైన తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై నోరుజారారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అంతా ప్రాంతీయ ఉగ్రవాదువాదులు అని కామెంట్స్ చేశారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణకు నాయకులు అయ్యారని ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదని అభివర్ణించారు. అంతటితో ఆగకుండా వారిని తాగుబోతులన్నారు. ఏపీ ప్రజలు తెలంగాణకు వెళ్లకుంటే వారు అడుక్క తినడం తప్ప.. అక్కడ ఏమీ ఉండవని సీరియస్ కామెంట్స్ చేశారు.
మాతో పెట్టుకోవద్దని…
అయితే దీనిపై తెలంగాణ మంత్రులు ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. ఇక్కడ పాలనా వైఫల్యాలు గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పలరాజు కామెంట్స్ పై తెలంగాణలోనూ విస్తృత ప్రచారం జరిగింది. ఇంత దారుణంగా మాట్లాడారేమిటని బీఆర్ఎస్ నేతలూ ఆశ్చర్యపోయారు. వైసీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లకు కోపం వచ్చిందని తెలుసుకున్న సీఎంవో సీఎం సీరియస్ అయ్యారని చిన్న హింట్ బయటకు ఇచ్చింది. నిజానికి అసలు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సంతోషపడి ఉంటారని… కానీ మిత్రుడిగా ఉన్న కేసీఆర్ తో పెట్టుకోవడం ఎందుకని అప్పలరాజుకు కాస్తా మందలించి ఉంటారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో సాగుతోంది. ఎదుటి వారిని తిట్టించి ఆనందం పొందుతారే తప్ప.. అక్కడ మందలించిన దాఖలాలు సైతం ఉండవన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఆ కారణాలతోనే తగ్గుతున్న వైసీపీ..
ఈ మధ్యన ఏపీపై తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధుల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్యనే ఏపీకి వచ్చిన ఎంపీ సోయం బాబూరావు ఇక్కడి రోడ్లేంటి మరీ ఇంత దారుణమా అని వ్యాఖ్యానించారు. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక్కడి రోడ్లు ఇంతే ఎంపీగారు అని నెటిజన్లు రిప్లయ్ ఇచ్చారు. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇక్కడి ప్రభుత్వం కాకుండా.. తెలంగాణ సర్కారు స్పందించడం కూడా వైసీపీ నేతలకు రుచించడం లేదు. ఇటువంటి తరుణంలో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. అది మరింత అగాధంగా మారితే కేసీఆర్ నుంచి ఎదురయ్యే పరిణామాలు జగన్ కు తెలుసు. అందులో భాగంగానే అప్పలరాజుకు తగ్గు అని హింట్ ను ఇచ్చి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.