Palm Payment System: కాలం మారింది. డబ్బుకు నిర్వచనం కూడా మారింది. పెరిగిపోయిన టెక్నాలజీ వల్ల డబ్బు కొత్త రూపును సంతరించుకుంది. పర్సులను వదిలిపెట్టి.. బీరువాలను దాటుకొని..స్మార్ట్ ఫోన్ లో ఒదిగిపోయింది.. డిజిటల్ రూపంలో ఇమిడిపోయింది.
అందువల్లే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లినా డిజిటల్ రూపంలో చెల్లింపులు చేయడం పెరిగిపోయింది. ఒకప్పుడు డెబిట్ కార్డు ఉండేది. ఒక స్థాయి ఉన్నవారు క్రెడిట్ కార్డు వాడేవారు. ఇప్పుడు వీటి వాడకం చాలా వరకు తగ్గింది. అన్ని రకాల చెల్లింపులకు యూపీఐ ని వాడటం సర్వసాధారణమైపోయింది. అయితే యూపీఐ కూడా త్వరలోనే కాల గతిలో కలిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పెరిగిన టెక్నాలజీ వినియోగం వల్ల అరచేతి ద్వారానే చెల్లింపులు చేసే అవకాశం లభించనుంది.. ఈ అద్భుతమైన టెక్నాలజీ చైనాలో అందుబాటులోకి వచ్చింది. చైనాలోని జూజౌ అనే పట్టణంలో ఒక స్టోర్ రూమ్ లో పామ్ పేమెంట్ సిస్టం ద్వారా చెల్లింపులు మొదలయ్యాయి. దీనిని పాకిస్తాన్ దేశానికి చెందిన రానా అంజా సైఫ్ అనే ఒక కంటెంట్ క్రియేటర్ చూశాడు. సారిగా ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తను కూడా అదే తరహాలో చెల్లింపుల కోసం అరచేతిని స్కాన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని అతడు తన స్మార్ట్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడు. దానిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశాడు..” శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైనా దూసుకుపోతోంది. ప్రపంచం మొత్తం 2024లో జీవిస్తుంటే.. చైనా మాత్రం 2050లో బతికేస్తోంది. పామ్ పేమెంట్ విధానాన్ని ఇంకా ప్రపంచం గుర్తించక ముందే చైనా అమల్లో పెట్టేసింది. ఇప్పటికీ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో యూపీఐ విధానంలో చెల్లింపులు జరగవు. కానీ చైనా మాత్రం పామ్ పేమెంట్ విధానంలోకి వచ్చేసింది.. ఇది త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నానని” అతడు వ్యాఖ్యానించాడు.. ఇక దీనిపై గతంలోనే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్షా గోయాంకా ఒక వీడియోను తన ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రకారం బీజింగ్ లోని మెట్రో ట్రైన్లో ప్రయాణించడానికి ఓ మహిళ తన అరచేతిని అడ్డుపెట్టి నగదు చెల్లింపు చేసింది. దీనిని టెక్నాలజీ సాధించిన అద్భుతమని హర్ష అప్పట్లోనే వ్యాఖ్యానించారు.
ఇలా పనిచేస్తుంది
నగదు చెల్లింపులను అరచేతి ద్వారా చేయాలంటే యూపీఐ మాదిరిగానే కొన్ని విధానాలను పాటించాలి. ముందుగా మనం చెల్లింపులు చేసే చేతిని ప్రత్యేక స్కానర్ తో స్కాన్ చేయించాలి. మనం స్కాన్ చేయించిన అరచేతి రూపాన్ని బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ తో కూడి ఉన్న యాప్ లో నమోదు చేయించాలి. ఒక్కసారి ఆ ప్రక్రియ పూర్తయితే ఎక్కడికి వెళ్లినా అరచేతిని ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఇది చైనాలో మాత్రమే అమల్లో ఉంది. అక్కడ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయితే పామ్ పేమెంట్ విధానం టెస్టింగ్ దశలోనే ఉందని.. ఈ విధానంలోనూ కొన్ని సవాళ్లు ఉన్నాయని… అవి పూర్తయిన తర్వాత దేశం మొత్తం అమలు చేసే అవకాశం ఉందని చైనా మీడియా చెబుతోంది.