
Chandrababu- Gannavaram: చంద్రబాబు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సైకోలు ఎక్కువైపోయారని అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనను పరిశీలించేందుకు శుక్రవారం వచ్చిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలతో, దాడి దృశ్యాలను చూసి చలించిపోయారు. త్వరలో మా ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు ఒక్కొక్కరి లెక్కలు తీరుస్తా.. మక్కెలిరగొడితే ఎవరికి చెప్పుకుంటారో చూస్తాను.. అంటూ ధ్వజమెత్తారు. పోలీసులు కూడా సైకోల్లా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నించారు.
చంద్రబాబు గన్నవరం పర్యటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. ఏం మేము గన్నవరం రాకుడదా? ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అంటూ ధ్వజమెత్తారు. గన్నవరానికి చేరుకున్న ఆయన ముందుగా రిమాండ్ లో ఉన్న దొంతు చిన్నా కుటుంబసభ్యలను పరామర్శించారు. అనంతరం ధ్వంసమైన పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. మీడియాకు అక్కడ జరిగిన ఘటనను చూపించారు. పగలగొట్టిన వాహనాలన్నీ టీడీపీ వారివే.. అయినా, వారిపైనే కేసులు వేశారంటూ మండిపడ్డారు.
రెచ్చగొట్టి కావాలనే ఒక ప్రణాళిక ప్రకారం విధ్వంసం సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. కొంతమంది బుద్దిలేని పోలీసులు సైకోలుగా మారిన వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన తరువాత వారి సంగతి తేలుస్తానని హెచ్చరికలు జారీ చేశారు. గన్నవరం దగ్గరలోనే సీఎం క్యాంపు కార్యాలయం ఉంది. అయినా ఈ రౌడీ అరాచకాలంటే ఏంటి అని ప్రశ్నించారు. ‘‘ జగన్ ను నమ్ముకున్న ఎందో పోలీసులు జైలుకు వెళ్లారు. తప్పు చేసి పోలీసులు అదేబాట పట్టొద్దు. ఇకనైనా మారండి’’ అంటూ సూచించారు. ‘‘దొంగాటలు వద్దు. లగ్నం పెట్టుకుందాం. తాడోపేడో తేల్చుకుందాం. ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా రండి తేల్చుకుందాం.. సైకోని కూడా తీసుకురండి’’ అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు.

మొత్తానికి చంద్రబాబు గన్నవరం పర్యటన ప్రశాంతంగా ముగిసింది. నిరుత్సాహంలో ఉన్న టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, వేధించినా అండగా ఉంటాననే భరోసా కల్పించారు. అయితే, వైసీపీ శ్రేణుల ఆగడాలు మాత్రం ఆగలేదు. గల్లీ స్థాయి నేతలను బెదిరింపులకు పాల్పడుతూనే ఉండటం గమనించదగ్గ విషయం.