
Chandrababu: రాబోవు 2024 శాసన సభ ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ గా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు తీసుకున్నాయి. విజయబావుటా ఎగరవేసి అధికార పార్టీ దర్పం ప్రదర్శించాలని చూస్తుంటే, టీడీపీ తమ అభ్యర్థుల గెలుపుతో పునాది రాయిగా మార్చుకోవాలని భావిస్తుంది. ఈ మేరకు వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు పట్టభద్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి చంద్రబాబు బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 13న ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ, రాయలసీమ గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వంలో ఉన్నారు. సంక్షేమాన్ని గుర్తించాలని వైసీపీ నేతలు కోరుతుంటే, భవిష్యత్తును గుర్తుంచుకొని టీడీపీ అనుబంధ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ఓటర్లకు సూచిస్తున్నారు.
ఉపాధ్యాయ స్థానాల్లో బరిలోకి దిగిన పీడీఎఫ్ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. వీరికి టీడీపీ మద్దతు తెలుపుతుంది. ఆ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. వ్యతిరేక ఓటు చీలకుడదని ఆయన పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గెలవకూడదని అన్నారు. అందుకే రెండో ప్రాధాన్య ఓటు విషయంలో జాగ్రత్తలు వహించాలని, దీనిని ఓటర్లు గుర్తించాలని కోరారు.

టీడీపీకి మొదటి ప్రాధాన్య ఓటు వేసిన తరువాత, పీడీఎఫ్ అభ్యర్థులకు రెండో ప్రాధాన్య ఓటు వేయాలని టీడీపీ శ్రేణులు, ప్రజలను కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు. తూర్పు, రాయలసీమ ఉపాధ్యాయ ఎన్నికల్లో ఏపీటీఎఫ్, పీడీఎఫ్ లకు మొదటి, రెండో ప్రాధాన్య ఓట్లు వేయాలని అభ్యర్థించారు. విభజన కష్టాలు ఉన్నా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి ప్రతి నెల 1వ తేదీకే జీతాలు ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఇప్పటి వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను ఏ విధంగా అవమానపరుస్తుందో గమనించి ఓటు వేయాలని అభ్యర్థించారు.