Video resume : వీడియో రెజ్యూమె.. ఆమె దశను మార్చేసింది..

ఈతరం ఆలోచనలే వేరు.. ప్రతీ విషయాన్ని భిన్నంగా, కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు. తమ టాలెంట్‌ను బయట పెడుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : October 17, 2024 12:21 pm

Laiba Fateh

Follow us on

Video resume : ఏ పని అయినా అందరిలా చేస్తే కొత్త ఏమీ ఉండదు. గుంపులో గోవింద అన్న చందంగానే ఉంటుంది. కానీ, మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే రొటీన్‌కు భిన్నంగా ఏదైనా చేయాలి. అప్పుడే మనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మన టాలెంట్‌ను ఎదుటివారు గుర్తిస్తారు. మన ప్రతిభకు తగిన ప్రతిఫలం కూడా దొరుకుతుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఇదే కోరుకుంటున్నాయి. రొటీన్‌కు భిన్నంగా, అదనపు అర్హతలు ఉన్నవారికి, అనుభవం ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో జీతాలు కూడా ఇస్తున్నాయి. అయితే కొందరు తమలో టాలెంట్‌ ఉన్నా.. వాటిని చెప్పుకునే విధానంలో విఫలం అవుతున్నారు. అలాంటి వారు కూడా ఉద్యోగాలు సాధించడంలో విఫలం అవుతున్నారు. ఇక కొందరు తమ టాలెంట్‌ను వెరైటీగా ఎక్స్‌ప్రెస్‌ చేస్తూ.. ఎక్కువ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. తమ జీవితాన్ని మార్చుకుంటున్నారు.

రొటీన్‌కు భిన్నంగా..
లైబా ఫతే.. ఈ అమ్మాయి అందరికన్నా భిన్నంగా ఉండాలనుకుంది. కంపెనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అందరూ పాటించే పద్ధతి రెజ్యూమె. సీవీ(కరిక్యులమ్‌ విటే)లే. అయితే ఆ పద్ధతికి స్వస్తి పలుకుతూ తనను తాను కొత్తగా ప్రజెంటేషన్‌ చేసుకోవాలనుకుంది లైబా. తన నైపుణ్యాలను, ఉద్యోగ అర్హతలను అందరిలా కాకుండా రెజ్యూమెను వీడియో రూపొందలో పొందుపర్చింది. దీనికి జతగా తను ఆ ఉద్యోగానికి ఎందుకు అర్హురాలో కూడా వివరంగా రాసి లింక్లిన్‌లో ఉంచింది.

సీఈవో ఫిదా..
ఈ దరఖాస్తును పరిశీలించిన ఆ ఘోస్ట్‌ రైటింగ్‌ కంపెనీ సీఈవో తస్లీమ్‌ అహ్మద్‌ ఫతే.. లైబా వినూత్న ఆలోచనకు, ఆమెలోని ఆత్మవిశ్వాసానికి ఫిదా అయ్యారు. 800 మంది ఇచ్చిన రెజ్యూమెలో కేవలం లైబాను మాత్రమే సెలెక్ట్‌ చేశారు. ఆయన నమ్మకానికి తగినట్లే లైబా కూడా అద్భుత పనితీరు ప్రదర్శించింది. కేవలం ఆరు నెలల్లోనే ఈక్విటీ పార్టనర్‌గా పదోన్నతి పొందింది. ప్రస్తుతం ఏజెన్సీ పనులన్నీ లైబానే పర్యవేక్షిస్తోంది. ఈ ప్రయాణం మొత్తాన్ని కంపెనీ సీఈవో తస్లీమ్‌ లింక్లిన్‌లో పోస్టు చేశారు.

బెస్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఇదే..
లింక్లిన్‌లో తస్లీమ్‌ ఇలా రాసుకొచ్చారు.. ‘నా జీవితంలో నేను చేపట్టిన బెస్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఇదే. అనుభవం లేకపోయినా ఆమె ఉద్యోగానికి రెజ్యూమె కూడా ఇవ్వలేదు. అంతకంటే అద్భుతమైన వీడియోను రూపొందించింది. నేర్చుకున్న నైపుణ్యాలు అందరికీ వస్తాయి. కానీ, నేర్చుకోవాలనే ఉత్సుకత, పట్టుదల ఉన్న అభ్యర్థులను ఎంచుకోవడం కీలకం. అలాంటి వారికే మేనేజర్లు అయ్యే అవకాశం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. మన యువతలో చాలా సామర్థ్యం ఉందని, కానీ, వాళ్లకు కావాల్సింది మార్గనిర్దేశమే అని లింక్లిన్‌లో తస్లీమ్‌ పోస్టు చూసిన చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, క్రియేటివ్‌గా ఆలోచించడంలో లైబా చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది.