Advertisement: ఆ మధ్య ఓ ఫెయిర్నెస్ క్రీమ్ ఒక యాడ్ చేస్తే కోట్ల డబ్బు ఆఫర్ చేసింది. అయినప్పటికీ సాయి పల్లవి ఒప్పుకోలేదు.. ఇది సమాజం పట్ల ఒక నటికి ఉన్న బాధ్యత. అదే మహేష్ బాబు ఓ గుట్కా కంపెనీకి సంబంధించిన యాడ్ లో నటిస్తాడు. విజయ్ దేవరకొండ కూల్ డ్రింక్ తాగాలని చెప్తాడు. సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులు ఇలాంటివి చేయడం క్షంతవ్యం కాదు. కానీ కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే ఆఫర్ కు దాసోహం అంటుంటారే తప్ప… చేయబోమని చెప్పే ధైర్యం వారికి ఎక్కడిది. ఇలాంటి సెలబ్రిటీలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు బోలెడు చేస్తూ ఉంటారు.. ఉదాహరణకు విజయ్ దేవరకొండ తాగమని చెప్పే కూల్ డ్రింక్ లో అడ్డగోలుగా కెఫీన్ ఉంటుంది. అది నిజానికి పిల్లలకు, గర్భిణులకు మంచిది కాదు.. మోతాదు పెరిగితే ఎవరికి మంచిది కాదు. కానీ పెద్ద పెద్ద స్టార్స్ కూల్ డ్రింక్ తాగుతున్నట్టుగా పెద్ద ప్రకటన ఇచ్చి, దిగువన ఎక్కడో కని కనిపించని రీతిలో ఎక్కువ కెఫీన్ మంచిది కాదు అని చిన్న డిస్ క్లేయిమర్ ఇస్తారు. ఇలాంటివన్నీ ఏటా వేల కోట్ల దందా.. ఉదాహరణకు పాన్ మసాలా పేరిట గుట్కాలు, మినరల్ వాటర్, సోడాల పేరిట మద్యం యాడ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు.

ఇలాంటి వ్యవహారాల్లో ప్రింట్ మీడియా, మీడియా కాస్త జాగ్రత్త పాటిస్తున్నాయి.. కానీ డిజిటల్ మీడియాకు ఆ కట్టుబాటు లేదు.. ఉదాహరణకు ఒక సెలబ్రిటీ తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఏదో ఒక బ్రాండ్ ఉత్పత్తి ఫోటో పెట్టి, తన ఫోటో పెట్టి వావ్ అని క్యాప్షన్ పెడుతుంది. లక్షల్లో ఫాలోయర్స్ ఉంటారు కదా .. ఇది పోస్ట్ చేసినందుకు లక్షలు, కోట్లల్లో చార్జ్ చేస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీలకు ఇది ఒక అతిపెద్ద ఆదాయ వనరుగా మారిపోయింది. కనీసం వినియోగదారులకు ఈ ఉత్పత్తులు లాభమా? నష్టమా? అనే సోది కూడా ఉండదు.. డిస్ క్లెయిమర్ల చికాకు అసలే ఉండదు. ఎవడి ఇష్టం వాడిది. కంపెనీలు డబ్బిస్తున్నాయి.. వారు ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నారు.. మధ్యలో వినియోగదారులు ఎటు పోతే వారికి ఏంటి? వారి చావు వారు చస్తారు అనే నిర్లక్ష్యం తప్ప…ఇంకొకటి ఎక్కడ ఉన్నది కనుక. చాలా సందర్భాల్లో సెలబ్రెటీలు అభిమానులే మా దేవుళ్ళు అని అంటారు కానీ.. వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి విభిన్నం.. ఆ సమయం వరకే ఏదో హడావిడి.. తర్వాత షరామాములే.
కేంద్రం ముకుతాడు
ఇప్పుడు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌరసరఫరాలు, ఆహార మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనపై కాస్త దృష్టి పెట్టింది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా లో వెలువల వచ్చి పడుతున్న తప్పుదోవ ప్రకటనలకు గైడ్లైన్స్ జారీ చేసింది. సెలబ్రిటీలు ఇష్టారాజ్యంగా ఇలాంటి ప్రకటనలు ఎండార్స్ చేస్తే ఇకపై కుదరదు.. వాళ్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.. వ్యక్తిగత అభిప్రాయాలను ప్రమోషన్స్ చేస్తామంటే కొన్ని జాగ్రత్తలు, కట్టు బాట్లు తప్పనిసరి.. మేరకు ఎండార్స్మెంట్స్ నో హౌస్ అనే గైడ్ ని విడుదల చేసింది.
వాస్తవానికి ఒక సర్వీస్, ప్రొడక్ట్, బ్రాండ్… ఏది చెపుతున్నా సరే దానికి, సెలబ్రిటీకి మధ్య సంబంధం ఏమిటో బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు సదరు పోస్టుల వల్ల తాము పొందే లాభాలు ఏమిటో కూడా చెప్పాల్సి ఉంటుంది. డబ్బు మాత్రమే కాదు, బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నప్పుడు సెలబ్రిటీలు ట్రిప్పులు, హోటల్ స్టే లు, కానుకలు, ప్రయోజనాలను పొందుతూ ఉంటారు.. సరళమైన భాషలో అడ్వర్టైజ్మెంట్, పెయిడ్ ప్రమోషన్, స్పాన్సర్డ్ వంటి డిస్ క్లెయుమర్ లను కూడా స్పష్టంగా సూచించాలి.

అంతేకాదు సెలబ్రిటీలు ఏ ఉత్పత్తి గురించి పోస్టులు పెడుతున్నా సరే… ఆ ఉత్పత్తిని తాము వాడుతూ ఉండాలి. తమకు వ్యక్తిగతంగా దానితో అనుభవం ఉండాలి.. ఇది ఆచరణలో కొంత కష్టమే. ఫలనా మసాలా వాడుతున్నామని మహేష్ బాబు చెబుతాడు.. కానీ ఓ ఇంటర్వ్యూలో తాను మసాలా వేసిన కూరలకు దూరమని అంటాడు.. మరి ఇందులో వెర్రి పుష్పాలు అయ్యేది వినియోగదారులే కదా! ఇలాంటి వాటిపై బోలెడు ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఇలాంటి క్లాజ్ ఒకటి తీసుకొచ్చింది. కార్పొరేట్ వాడు ఇచ్చాడు. నేను డబ్బు తీసుకున్నాను.. ప్రకటన చేశాను అంటే ఇకపై కుదరదు.