
KCR Newspaper: ఏపీలో మరో దినపత్రిక పురుడుపోసుకోనుందా? సరికొత్త రాజకీయ వ్యూహంతో పేపర్ తీర్చిదిద్దనున్నారా? భారీ పెట్టుబడి పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. అయితే ఈ పేపర్ వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని తెలియడం కాస్తా ఆసక్తి గొలుపుతోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో దినపత్రికలు తక్కువే. తెలంగాణ స్థాయిలో జర్నలిస్టులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. కేసీఆర్ తాజా నిర్ణయం మీడియా వర్గాల్లో ఆనందం నింపుతోంది. అయితే ఆ పత్రిక ఎంతవరకు మనగలదే అన్నదే ఇప్పుడు ప్రశ్న.
ప్రస్తుతం ఏపీలో మీడియా వర్గాలుగా మిగిలిపోయింది. టీడీపీకి అనుకూలంగా ఉండే ఎల్లో మీడియా, వైసీపీకి అనుకూలంగా ఉండే నీలిమీడియాతో పాటు తటస్థ మీడియా ఉంది. అయితే తటస్థ మీడీయా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను మార్చుకుంటూ వస్తున్నాయి. యాడ్లు, ప్యాకేజీలు బట్టి ప్రాధాన్యతలు మార్చుకుంటున్నాయి. ఈ తరుణంలో ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ పనిలో ఉన్న కేసీఆర్ సొంతంగా మీడియా ఉండాలని భావిస్తున్నారు. మిగతా మీడియాలు సహకరించే చాన్స్ లేదని భావిస్తున్నఆయన నమస్తే తెలంగాణ మాదిరిగా నమస్తే ఆంధ్రా పేరిట పేపర్ ను తేవాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దినపత్రికను నడపడం కష్టంతో కూడుకున్న పని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి సంస్థలు కిందమీద పడి పత్రికలను నడుపుతున్నాయి. దాదాపు అన్ని పత్రికలదీ నేల చూపే. ఈనాడు ప్రింట్ కొనసాగింపునకు కిందా మీదా పడుతోంది. యాడ్స్ టారిఫ్ అడ్డగోలుగా తగ్గించింది. జమా ఖర్చుల మధ్య తేడాను పూడ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నది. మొత్తం ప్రింటింగ్ యూనిట్లు మూసి పారేసి, జిల్లాల్లో ఆఫీస్ యూనిట్లు షట్ డౌన్ చేసి, కేవలం రామోజీ ఫిలిం సిటీ ఆఫీస్ మాత్రమే కొనసాగించి, ఇకపై డిజిటల్ ఎడిషన్, ఈటీవీ భారత్ పై మాత్రమే దృష్టి పెట్టాలని ఎప్పటికప్పుడు అనుకుంటున్నది. కానీ దానికి అది సాధ్యం కావడం లేదు. అటు నమస్తే తెలంగాణాది అదే పరిస్థితి. ఇటువంటి తరుణంలో కేసీఆర్ నమస్తే ఆంధ్రా ఎంతవరకూ కార్యరూపం దాల్చుతుందో చూడాలి మరి.