
Amaravati- BJP: అమరావతి విషయంలో బీజేపీ స్వరం మారుతున్నట్లు కనిపిస్తుంది. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అంటూ చెప్పుకొస్తున్నా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్‌కు ఏకైక రాజధాని చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అమరావతికి రైల్వే కనెక్టివిటి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అయిష్టతతో సంబంధం లేకుండా రైల్వే శాఖ పూనుకొని పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిన తరువాత, రోడ్డు, రైలు, వాయు మార్గాలను కనెక్ట్ చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రచించింది. ఆ మేరకు గుంటూరు-విజయవాడలను కలుపుకుంటూ అమరావతికి కనెక్ట్ చేసేందుకు అంచనాలు తయారు చేసి కేంద్రానికి పంపింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలో మీటర్ల మేర సింగిల్ లైన్ ప్రతిపాదించారు. దీనికి కనెక్టివిటీగా అమరావతి నుంచి పెదకూరపాడు వరకు 25 కిలో మీటర్ల మేర సింగిల్ లైన్, కృష్ణా నది మీదుగా 3 కిలో మీటర్ల మేర నూతన బ్రిడ్జి నిర్మాణం తదితర పనులకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందు కోసం రూ.2,800 కోట్లు అవసరమవుతాయని తెలిపింది. అందుకు 2017-18 బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయింపు జరిగింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరాతి రాజధాని అని ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో అప్పటి వరకు జరిగిన పనులన్ని అంతటితో నిలిచిపోయాయి. ఇప్పుడు రైల్వే శాఖ స్వయంగా పూనుకొని అమరావతికి కనెక్టివిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు 28 కిలో మీటర్ల మేర సింగిల్ లైన్ చేపట్టనున్నట్లు రైల్వే డీఆర్ఎం తెలిపారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతి లేకుండా రైల్వే శాఖ అమరావతి రైల్వే ప్రాజెక్టు అంశం పట్టాలెక్కే అవకాశమే ఉండదు. వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధాని చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో, అమరావతిని సజీవంగా ఉంచేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై వైసీపీ ప్రభుత్వం నిర్ణయమేమిటో ఇప్పటి వరకు స్పందించలేదు.