
BJP Alliances: పాపం బీజేపీకి కాలం కలిసిరావడం లేదు. ఎన్నో ఏళ్లుగా పూర్తి స్థాయి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్న కల తీరడం లేదు. ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్లే తప్పని పరిస్థితులు మాత్రమే నెలకొని ఉంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి సరిపోయింది. ప్రస్తుతం ఏ పార్టీతో కలిసి వెళ్లాలనే అంశంపైనే తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనబడుతుంది.
2004లో బీజేపీకి 18 శాతం ఓట్లు కనబడుతుండటంతో టీడీపీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఆ తరువాత కూడా తెలుగుదేశం పార్టీతోనే కలసి ఉంది. చంద్రబాబుతో కలిసి పనిచేయడం వల్ల బీజేపీ శ్రేణులు కూడా ఆయనకు మరీ దగ్గరగా జరిగి స్వయం ప్రకాశక స్వభావాన్ని కోల్పోయాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటం, వైఎస్ చరిష్మా ముందు బీజేపీ పూర్తిగా కోలోకోలేని స్థితికి వెళ్లిపోయింది.
కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక 2019కి ముందు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి మరలా దగ్గరైంది. కేబినెట్లో కూడా బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. రాష్ట్ర విభజన జరగడం, ఎన్నికల హామీల్లో చేస్తామన్న హామీల గురించి మోడీ ప్రభుత్వం తాత్సారం చేయడంతో చంద్రబాబు అలిగారు. అప్పటి వరకు కాస్తా కూస్తో నిధులు ఇస్తున్న కేంద్రం అప్పటి నుంచి ఇవ్వడంలో కాస్తా మందగించింది. టీడీపీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా రాజీనామా చేసేశారు. కానీ.. కేంద్రంలో అధికారంలో ఉండడంతో బలమైన నేతలను తమవైపు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. టీడీపీ దూరం జరిగాక రాష్ట్రంలో మరలా ప్రాభవం కోల్పోవడం ప్రారంభమైంది.

ప్రస్తుతం జనసేనతో బీజేపీ కలిసి వెళ్తుంది. పవన్ కల్యాణ్ కూడా ఆ పార్టీతో పొత్తు విషయంలో ఆలోచనలో పడ్డారు. మరోవైపు వైసీపీకి పూర్తి స్థాయిలో మోడీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా అంశాలపై జగన్ పూర్తి స్థాయిలో నిలదీయడం లేదు. స్వప్రయోజనాలే ముఖ్యంగా ఆయన వ్యవహరిస్తుండటంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే బీజేపీ స్వతహాగా వెలగడం కన్నా ఇతరులపై ఆధారపడి బతకడానికే అలవాటైనట్లు ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతీసారి ఆశావహ దృక్పథంతో తమను కలుపుకుపోయే పార్టీల వైపు ఆశగా చూడటం పరిపాటిగా మారిందనడంతో సందేహం లేదు.