Pawan Kalyan- BJP: ఓటములు ఎన్నో గుణపాఠాలు నేర్పుతాయంటారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే మనిషి రాటుదేలుతారంటారు. ఓటమి గెలుపునకు నాంది అని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ అటువంటి పంథానే ఎంచుకున్నట్టున్నారు. 2014 ఎన్నికల్లో త్యాగం చేసి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు. గెలిపించే బాధ్యత తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో ప్రయోగం చేశారు. ఒంటరిగా పోటీచేశారు. ఓటమి చవిచూశారు. కానీ రాష్ట్రంలో గెలుపోటములను ప్రభావితం చేయగలిగారు. 2024 ఎన్నికలను మాత్రం పక్కా వ్యూహంతో ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. గతంలో ఎదురైన అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతున్నారు. ఏపీలో అన్నివర్గాల అభిమానాన్ని చూరగొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ మూలాలపై దృష్టిపెట్టారు. ఆయనపై నమ్మకం పెట్టుకొని దగాకు గురైన వర్గాలపై దృష్టిసారించారు.

గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో జగన్ ఏకపక్ష విజయం సాధించారు. అటు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలను క్లీన్ స్వీప్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఎటువంటి పెద్దపీట వేయలేదు సరికదా.. రాజ్యాంగబద్ధంగా దశాబ్దాలుగా ఉన్న పథకాలను నిలిపివేశారు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను సైతం పక్కదారి పట్టించారు. సబ్ ప్లాన్ నిధులను సంక్షేమ పథకాల కోసం మళ్లించారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకం కానీ, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకుకానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అందుకే పవన్ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీల సమస్యలనే అజెండాగా తీసుకొని పోరాడేందుకు సిద్ధపడుతున్నారు.
రిపబ్లిక్ డే వేడుకల అనంతరం పవన్ ప్రసంగంలో ఎక్కువ సమయం అణగారిన వర్గాల గురించే సాగింది. ముఖ్యంగా ఒక పద్ధతి ప్రకారం ఎస్సీ, ఎస్టీలను జగన్ సర్కారు ఎలా దగా చేసిందో పార్టీ శ్రేణులకు వివరించారు. అయితే పవన్ వ్యాఖ్యలు వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ సర్కారు చర్యలతో ఎస్సీ, ఎస్టీలు డిఫెన్స్ లో పడిపోయారు. అలాగని వారు టీడీపీ వైపు చూడడం లేదు. ఈ నేపథ్యంలో ఆ రెండు వర్గాలను దరి చేర్చుకోవాలని పవన్ భావిస్తున్నారు. అందుకే వారి సమస్యలు, నిధులు, విధులు, ప్రభుత్వం బాధ్యత గురించి మాట్లాడారు. జగన్ ఎలా వంచించారో వివరించారు. అయితే ఇప్పటికే పవన్ వైపు ఎస్సీలు ఆశగా చూస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు వారిని మరింత దగ్గర చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరో వైపు పవన్ వ్యూహాన్ని గమనించిన మిగతా రాజకీయ పక్షాలు రంగంలోకి దిగాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పాటు బీజేపీతో కలిసి నడిచేందుకు పవన్ మొగ్గుచూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు బీజేపీ నుంచి అంతగా ఆసక్తి కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది, అయితే తాజాగా పవన్ ఎస్సీ; ఎస్టీల పల్లకి అందుకునేసరికి బీజేపీలో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అజెండాతో బీజేపీ ముందుకెళ్లాలని భావిస్తోంది. దేశ వ్యాప్తంగా అదే ఫార్ములాతో సాగి బీజేపీ సక్సెస్ అయ్యింది. దేశ వ్యాప్తంగా 70 మంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. జనరల్ నియోజకవర్గాల్లో సైతం ఎస్టీలను బరిలో దింపి బీజేపీ గెలిపించుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు పవన్ అదే బాటలోకి వచ్చేసరికి బీజేపీ డిఫెన్స్ లో పడింది. మిత్రపక్షంగా ఉన్నందున నాయకులు పెద్దగా స్పందిచకున్నా.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం ఎస్సీ, ఎస్టీలు బీజేపీ వెంటే అన్న ప్రచారం మొదలుపెట్టడం విశేషం. పవన్ వ్యాఖ్యలు చేసిన తరువాత ఇవి మరింత విస్తృతం కావడం చర్చనీయాంశంగా మారింది.